Skip to main content

ఐపిఒలతో జాగ్రత్త

ప్రైమరీ మార్కెట్‌లో మళ్లీ పబ్లిక్‌ ఇష్యూ (ఐపిఒ)ల సందడి ప్రారంభమైంది. 2014లో 1,468 కంపెనీలు మాత్రమే నిధుల సమీకరణ కోసం పబ్లిక్‌ ఇష్యూకి వచ్చాయి. 2015లో ఈ సంఖ్య అమాంతం 13,862 కంపెనీలకు పెరిగింది. సమీకరించిన నిధుల మొత్తం కూడా రూ.68,608 కోట్లకు చేరింది. గత ఐదేళ్లలో పబ్లిక్‌ ఇష్యూల ద్వారా ఇంత పెద్ద మొత్తం సమీకరించడం ఇదే మొదటి సారి. పదేళ్ల కాలానికి చూస్తే ఇంత మొత్తం సమీకరించడం ఇది రెండో సారి. 2016లో కూడా ఐపిఒ మార్కెట్‌లో సందడి కొనసాగుతుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. రూ.7,315 కోట్ల సమీకరణకు 20 కంపెనీలు ఇప్పటికే సెబి నుంచి అనుమతి పొందాయి. మరో 11 కంపెనీలు రూ.5,445 కోట్ల సమీకరణ కోసం సెబి అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి. త్వరలో మరిన్ని కంపెనీలు ఐపిఒల కోసం సెబి దగ్గర తమ ముసాయిదా ప్రాస్పెక్టస్‌ సమర్పిస్తాయని అంచనా. ఇవన్నీ చూసి మార్కెట్‌కు వచ్చే ఐపిఒల్లో గుడ్డిగా ఇన్వెస్ట్‌ చేస్తే చేతులు కాలడం ఖాయం. కింది జాగ్రత్తలు పాటించడం ద్వారా అలాంటి ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. 
వేలం వెర్రి వద్దు 
చాలా మంది వేలం వెర్రిగా మార్కెట్‌కు వచ్చిన ప్రతి ఐపిఒకి దరఖాస్తు చేసి చేతులు కాల్చుకుంటుంటారు. మనం అప్లయ్‌ చేసే ఇష్యూకి ఆర్థిక సత్తా ఉందా? లేదా? అని ఆలోచించరు. ప్రమోటర్ల బ్యాక్‌గ్రౌండ్‌ కూడా పరిశీలించరు. ఇన్వెస్టర్లలో ఉన్న ఈ వేలం వెర్రిని ఆసరగా చేసుకునే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక అల్లాటప్పా కంపెనీలు ఐపిఒల పేరుతో ఇన్వెస్టర్లను నిలువునా ముంచాయి. ప్రస్తుతానికి ప్రైమరీ మార్కెట్‌లో అంత వేలం వెర్రి అయితే లేదు. 2013, 2014ల్లో మార్కెట్‌ మరీ డల్‌గా ఉంది. అందుకే 2015కు సంబంధించి ఐపిఒల సంఖ్య, సమీకరించిన నిధులు భారీగా కనిపిస్తున్నాయి. నిజానికి మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టాక దేశంలో వ్యాపార సానుకూలత పెరిగింది. దీంతో 2015లో ఐపిఒలు మరింత హోరెత్తాల్సింది. అలాంటిదేమీ జరగలేదు. దేశంలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నా ప్రధాన కంపెనీలేవి ఇప్పటికీ నిధుల సమీకరణ కోసం ప్రైమరీ మార్కెట్‌ను ఆశ్రయించడం లేదు. ప్రస్తుతం మార్కెట్‌కు వస్తున్న కంపెనీల్లో ఎక్కువ భాగం వ్యాపార విస్తరణకు అవసరమైన నిధుల సమీకరణ కోసం ఐపిఒలకు వస్తున్నాయి. లేదా వాల్యుయేషన్స్‌ బాగుండడంతో ప్రమోటర్లు కంపెనీల్లో తమ వాటా తగ్గించుకునేందుకు ఐపిఒలకు వస్తున్నారు. దీంతో ఇటీవల లిస్టయిన డాక్టర్‌ లాల్‌ పాథ్‌ లాబ్స్‌, ఇండిగో ఐపిఒలు ఇన్వెస్టర్లకు మంచి లాభాలు పంచాయి. కాకపోతే ఇన్వెస్టర్లు అప్లయ్‌ చేసే ఇష్యూ సత్తా ఏంటనే విషయాన్ని ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకుంటే మంచిది.
భారీ లాభాలు ఆశించవద్దు.. 
ఐపిఒల ద్వారా ఎపుడూ భారీ లాభాలు ఆశించవద్దు. సెకండరీ మార్కెట్‌తో పోలిస్తే ప్రైమరీ మార్కెట్‌లో లాభాలు ఎపుడూ తక్కువే. మార్కెట్‌ బాగుండి తమ పెట్టుబడులపై లాభాలు వస్తాయనుకుంటేనే ప్రమోటర్లు కంపెనీ ఈక్విటీలో తమకు ఉన్న వాటాలో కొంత భాగాన్ని పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సాధారణ ఇన్వెస్టర్లకు అమ్ముతుంటారనే విషయం గుర్తుంచుకోండి. అయితే గత రెండేళ్లలో ఈ ట్రెండ్‌ తిరగబడింది. ఇటీవల బిఎ్‌సఇ ఐపిఒ ఇండెక్స్‌ చూసినా ఈ విషయం అర్థమవుతుంది. కొద్దో గొప్పో క్వాలిటీ ఉన్న కంపెనీలు మాత్రమే పబ్లిక్‌ ఇష్యూలకు రావడం ఇందుకు ప్రధాన కారణం. మార్కెట్‌ పుంజుకుంటే, అత్యాశకు పోయే ప్రమోటర్లు కూడా ఐపిఒల ద్వారా ఇన్వెస్టర్లను దోచుకునే ప్రమాదం ఉంది. భారీ ప్రచారం, కల్లబొల్లి హామీలు, అధిక ధరలతో వచ్చే ఇలాంటి ఇష్యూల పట్ల ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే జేబు గుల్ల కావడం ఖాయం. ఇటీవల మార్కెట్‌కు వచ్చిన కొన్ని ఐపిఒలు ఇన్వెస్టర్లకు మంచి లాభాలు పంచాయి. అన్ని ఇష్యూల్లో ఇదే స్థాయిలో లాభాలు ఉంటాయనుకోవద్దు. మీరు పెట్టుబడి పెట్టిన మొత్తంపై ఎంత రాబడి వచ్చిందనే విషయం మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. అలాట్‌ అయిన షేర్లకు పెట్టిన పెట్టుబడి మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే లాభాలు ఎక్కువగా కనిపిస్తాయి.
జాగ్రత్తగా ఎంపిక.. 
ఐపిఒల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముందుగా ఆఫర్‌ డాక్యుమెంట్‌ క్షుణ్ణంగా చదవాలి. ఇటీవల మార్కెట్‌కు వస్తున్న ఇష్యూల్లో ఎక్కువ భాగం ఆ కంపెనీ ఈక్విటీలో పెట్టుబడి పెట్టిన ప్రైవేట్‌ ఈక్విటీ (పిఇ) ఇన్వెస్టర్లు లేదా వెంచర్‌ క్యాపిటలిస్టులు తప్పుకోవడం వల్ల వస్తున్నాయి. ఇలాంటి ఇష్యూల్లో వీరు పాక్షికంగా తమ పెట్టుబడులు ఉపసంహరించుకుంటే ఓకె. పూర్తిగా ఉపసంహరించుకుంటుంటే మాత్రం ఆ ఐపిఒల జోలికి పోకపోవడమే మంచిది. ఎందుకంటే లాభాలకు అవకాశం ఉన్న కంపెనీల నుంచి ఏ పిఇ సంస్థా, వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ పూర్తిగా తప్పుకోరు.

Comments