ఆన్‌లైన్లో డ్వాక్రా ఉత్పత్తులు!

ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌లలో అమ్మకాలు
విశాఖ, విజయవాడల్లో గోదాంలు 

డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న వెయ్యి రకాల వస్తువులను డిజిటల్‌ మార్కెట్‌లో విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్‌లైన్‌ విక్రయానికి ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ కంపెనీలతో సెర్ప్‌ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులు చర్చిస్తున్నారు. నగర ప్రాంతాల్లో డిమాండ్‌ ఉండడంతోపాటు పంపిణీ తేలిగ్గా ఉంటుందని భావించి విశాఖపట్నం, విజయవాడలతో మొదలుపెట్టాలని నిర్ణయించారు. ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పటికే సెర్ప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మహిళా సంఘాలు తయారుచేస్తున్న దుస్తులు, అపెరల్స్‌, ఇంటి అలంకరణ వస్తువులను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టేందుకు ఆ కంపెనీ అంగీకరించింది. డ్వాక్రా ఉత్పత్తుల క్యాటలాగ్‌ ఫోటోలకు కూడా సదరు కంపెనీనే తుది మెరుగులు దిద్దుతోంది.

ఆర్డర్‌ రాగానే పంపిణీ...ఫ్లిప్‌కార్ట్‌తో శిక్షణ
ఆన్‌లైన్‌లో మార్కెటింగ్‌ అంటే... ఎవరైనా కొనుగోలుకు ఆర్డర్‌ పెట్టిన తర్వాత వీలైనంత తొందర్లో ఆ వస్తువును చేర్చాల్సి ఉంటుంది. వస్తువు ప్యాకింగ్‌ కూడా రవాణాకు అనుగుణంగా ఉండాలి. ప్యాకింగ్‌, పంపిణీలపై డ్వాక్రా మహిళలకు ఫ్లిప్‌కార్ట్‌ సిబ్బంది శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఒక దఫా ఫ్లిప్‌కార్ట్‌ సిబ్బంది వచ్చి మహిళా సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులను చూసివెళ్లారు. త్వరలో రెండు, మూడు దఫాలుగా శిక్షణ ఇవ్వనున్నారు. విశాఖపట్నం, విజయవాడల్లో డ్వాక్రా సంఘాల ఉత్పత్తులను నిల్వ చేసి, ఆర్డర్‌ చేసిన ఖాతాదారులకు సరఫరా చేయడం కోసం రెండు నగరాల్లో గోదాములు తీసుకున్నారు. జిల్లాల మహిళా సమాఖ్యల పేరిట రిజస్ట్రేషన్‌ చేయించారు.
డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు ఏ బ్రాండ్‌ పేరు పెట్టాలనే అంశాన్ని ముంబయికి చెందిన ఒక సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ కొన్ని పేర్లను సూచించినా అవి సీఎం చంద్రబాబుకు నచ్చలేదని సమాచారం. మరింత మంచి పేరు కోసం కసరత్తు చేయాలని సూచించారు. ప్రస్తుతానికి దుస్తులు, అపెరల్స్‌, ఇంటి అలంకరణకు సంబంధించిన వస్తువులే ఆన్‌లైన్‌లో విక్రయించాలని నిర్ణయించారు. పచ్చళ్లు, తినుబండారాల మార్కెటింగ్‌పై చర్చిస్తున్నారు. డ్వాక్రా ఉత్పత్తులన్నింటికీ కలిపి ఒకే బ్రాండ్‌ ఉండాలా? ఉత్పత్తుల వారీ బ్రాండ్‌ ఉండాలా? అన్నది కూడా చర్చకు వచ్చింది. డ్వాక్రా ఉత్పత్తులన్నింటికీ ఒకే బ్రాండ్‌ ఉండాలని... అవసరమైతే ఆ బ్రాండ్‌ పేరు తర్వాత ఉత్పత్తుల పేర్లను సూచించవచ్చని ఆలోచిస్తున్నారు. బ్రాండ్‌ పేరు నిర్ణయం కాగానే డ్వాక్రా ఉత్పత్తుల ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ ప్రారంభించేందుకు సిద్ధమైంది.

(ఈనాడు వారి సౌజన్యంతో)

Comments

Popular posts from this blog

Twenty Smart Business Buzzwords

Navigating the Unknown: Leadership in an Era of Uncertainty

List of Cloud Certifications