విసిగిస్తే బ్లాక్‌ చేయండి

వాట్సప్‌లో నిమిషానికో మెసేజ్‌...ట్విట్టర్‌లో ట్వీట్లకు లెక్కేలేదు. జీమెయిల్‌ ఓపెన్‌ చేస్తే ఇన్‌బాక్స్‌లో అవసరం లేని మెయిల్సే కనిపిస్తాయి. మరి వీటిని ఆపేదెలా? అంటే అలాంటి మెసేజ్‌లు, మెయిల్స్‌ పంపే వారిని బ్లాక్‌ చేయడం ఒక్కటే మార్గం.అదెలాగో తెలుసుకోవాలంటే చదవండి.... 
జీమెయిల్‌లో...
జీమెయిల్‌ ఓపెన్‌ చేస్తే చాలు. ఇన్‌బాక్స్‌ మొత్తం పనికిరాని మెయిల్స్‌తో నిండిపోయి ఉంటుంది. వాటిని రోజూ డిలీట్‌ చేయడం ఓ పెద్ద పని. పోనీ ఆ మెయిల్స్‌ రాకుండా బ్లాక్‌ చేద్దామంటే సాధ్యం కాదు. అయితే ఇప్పుడు అలాంటి మెయిల్స్‌ను ఇన్‌బాక్స్‌లోకి రాకుండా చేసుకునే సౌలభ్యం వచ్చింది. ఇందుకోసం జీమెయిల్‌ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్‌ సహాయంతో సులభంగా అనవసర మెయిల్స్‌కు అడ్డుకట్ట వేసుకోవచ్చు. అప్పుడు మీ ఇన్‌బాక్స్‌లో అవసరమైన మెయిల్స్‌ మాత్రమే కనిపిస్తాయి. ఇన్‌బాక్స్‌ క్లీన్‌గా ఉంటుంది. మరి ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే ఇలా చేయండి. 
  • ముందుగా జీమెయిల్‌లోకి లాగిన్‌ అవ్వండి.
  • ఎవరి మెయిల్స్‌ను బ్లాక్‌ చేయాలనుకుంటే వారి మెయిల్‌ను ఓపెన్‌ చేయండి.
  • కుడివైపున ఉన్న మోర్‌ ఆప్షన్‌లోకి వెళ్లండి.
  • మోర్‌ ఆప్షన్‌ను ఎంచుకోగానే డ్రాప్‌-డౌన్‌ మెనూ ప్రత్యక్షమవుతుంది.
  • అందులో బ్లాక్‌ సెండర్‌ నేమ్‌ ఉంటుంది. దానిపై క్లిక్‌ చేస్తే బ్లాక్‌ టు కన్‌ఫార్మ్‌ అని విండో ఓపెన్‌ అవుతుంది.
  • ఇప్పుడు బ్లాక్‌పై క్లిక్‌ చేస్తే చాలు
ఇక నుంచి ఆ సెండర్‌ పంపే మెయిల్స్‌ అన్నీ ఇన్‌బాక్స్‌లోకి రాకుండా స్పామ్‌లోకి వెళ్లిపోతుంటాయి. 
ఫేస్‌బుక్‌లో బ్లాక్‌ చేయాలంటే...
ఫేస్‌బుక్‌లో అదేపనిగా మెసేజ్‌లు పోస్ట్‌ చేస్తూ ఇబ్బందిపెడుతున్న ఫ్రెండ్‌ను బ్లాక్‌ చేయాలంటే చాలా సింపుల్‌. ఇలా ఫాలో అయిపోండి. 
  • ఫేస్‌బుక్‌ అకౌంట్‌లోకి సైనిన్‌ అయ్యాక ప్రొఫైల్‌లోకి వెళ్లడానికి కుడివైపున చివరన ఉన్న ఆప్షన్‌పై ట్యాప్‌ చేయండి.
  • ఇప్పుడు వ్యూ యువర్‌ ప్రొఫైల్‌పై క్లిక్‌ చేయండి.
  • తరువాత అందులో ఫ్రెండ్స్‌ ఆప్షన్‌ని ఎంచుకుంటే మీ అకౌంట్‌తో యాడ్‌ అయి ఉన్న ఫ్రెండ్స్‌ లిస్ట్‌ కనిపిస్తుంది.
  • ఏ ఫ్రెండ్‌నైతే బ్లాక్‌ చేయాలనుకుంటున్నారో ఆ ఫ్రెండ్‌ నేమ్‌పై క్లిక్‌ చేయండి.
  • అతని ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ప్రత్యక్షమవుతుంది. అందులో ఫ్రెండ్స్‌, ఫాలోవింగ్‌, మెసేజ్‌ అని మూడు ఆప్షన్లు కనిపిస్తుంటాయి.
  • అందులో ఫ్రెండ్స్‌ అనే ఆప్షన్‌పై ట్యాప్‌ చేయండి.
  • అన్‌ఫాలో, అన్‌ఫ్రెండ్‌, ఎడిట్‌ ఫ్రెండ్‌లిస్ట్‌ అని మరో మెసేజ్‌ కనిపిస్తుంది. అందులో అన్‌ఫ్రెండ్‌ని ఎంచుకోండి.
అంతే... ఆ ఫ్రెండ్‌ బ్లాక్‌ లిస్ట్‌లోకి చేరతారు. మీ టైమ్‌లైన్‌లో ఎటువంటి మెసేజ్‌లు పోస్ట్‌ చేయలేరు. ఒకవేళ అన్‌బ్లాక్‌ చేయాలంటే ఆ ఫ్రెండ్‌కి మీరు మళ్లీ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపాలి. అతను ఓకే చేస్తే మళ్లీ ఫ్రెండ్స్‌గా యాడ్‌ అవుతారు. 

ట్విట్టర్‌లో....
అడ్డూ అదుపు లేకుండా వస్తున్న ట్వీట్స్‌ మీకు చికాకును తెప్పిస్తున్నాయా? అయితే ఆ ట్వీట్స్‌ని బ్లాక్‌ చేయండిలా... 
  • మీరు ఎవరి ట్విట్టర్‌ అకౌంట్‌ని బ్లాక్‌ చేయాలనుకుంటున్నారో వారి నేమ్‌పై క్లిక్‌ చేయండి. ఫాలోవర్స్‌ పేజ్‌ లేక ట్విట్టర్‌ ఫీడ్‌లో నుంచి కూడా క్లిక్‌ చేయొచ్చు.
  • ఇప్పుడు కుడివైపున కనిపిస్తున్న గేర్‌ బటన్‌పై క్లిక్‌ చేయండి.
  • ఇప్పుడు బ్లాక్‌ ఆప్షన్‌తో ఒక విండో కనిపిస్తుంది. బ్లాక్‌పై క్లిక్‌ చేసి కన్‌ఫార్మ్‌ చేయండి.
దీంతో మీరు చేసే ట్వీట్స్‌ వారి టైమ్‌లైన్‌లో కనిపించవు. మీరు కూడా వారి ట్వీట్స్‌ను చూడలేరు. అంతేకాకుండా వాళ్లు మిమ్మల్ని ఫాలో కాలేరు. మీ అకౌంట్‌ని వారి లిస్ట్‌లోకి యాడ్‌ చేసుకోలేరు. అయితే ఒకవేళ మీ ట్విట్టర్‌ ప్రొఫైల్‌లో పబ్లిక్‌ ఆప్షన్‌ను ఎంచుకుంటే కనుక మీ ప్రొఫైల్‌ అందరికీ కనిపిస్తుంది. మీ ట్వీట్స్‌ అందరూ చూడొచ్చు. ఒకవేళ అన్‌బ్లాక్‌ చేయాలంటే మళ్లీ గేర్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేయాలి. తరువాత డ్రాప్‌-డౌన్‌ మెనూలో అన్‌బ్లాక్‌ని ఎంచుకుంటే చాలు. మళ్లీ ట్వీట్స్‌ చూడొచ్చు. ఫాలోవర్‌గా మారిపోతారు. 

వాట్స్‌ప్‌లో ఇలా....
వాట్సప్‌... ప్రపంచాన్ని ఊపేస్తున్న అప్లికేషన్‌ ఇది. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు వాట్సప్‌లో మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి. అవసరం ఉన్నవీ, లేనివీ మీకిష్టం ఉన్నా లేకపోయినా మొబైల్‌లోకి చేరిపోతుంటాయి. కొన్ని వీడియోలు డౌన్‌లోడ్‌ చేయడానికే టైమ్‌ సరిపోతుంది. కొన్ని మెసేజ్‌లు మరీ లెంగ్తీ ఉండటంతో చికాకును తెప్పిస్తుంటాయి. ఇలాంటి ఇబ్బందులు దూరం కావాలంటే చికాకు తెప్పించే మెసేజ్‌లు పంపిస్తున్న వారిని బ్లాక్‌ చేయడం ఒక్కటే మార్గం. అందుకోసం ఇలా చేయండి... 
  • వాట్స్‌పలో ఎవరినైతే బ్లాక్‌ చేయాలనుకుంటున్నారో వారి నేమ్‌పై క్లిక్‌ చేయాలి.
  • ఇప్పుడు పైన కుడివైపున నిలువుగా కనిపిస్తున్న మూడు డాట్స్‌పై క్లిక్‌ చేస్తే ఒక మెనూ కనిపిస్తుంది.
  • అందులో మోర్‌ ఆప్షన్‌ని ఎంచుకోవాలి. ఇప్పుడు మరో మెనూ కనిపిస్తుంది.
  • అందులో బ్లాక్‌, క్లియర్‌ చాట్‌, ఈమెయిల్‌ చాట్‌, యాడ్‌ షార్ట్‌కట్‌ అని ఆప్షన్స్‌ ఉంటాయి.
  • బ్లాక్‌పై క్లిక్‌ చేయడం ద్వారా ఆ వ్యక్తిని వాట్స్‌పలో బ్లాక్‌ చేసుకోవచ్చు.
దీంతో వాళ్లు పంపే మెసేజ్‌లు మీకు చేరవు. మీరు ఆన్‌లైన్‌లో ఉన్నారా లేదా అనే విషయాన్ని కూడా అవతలి వ్యక్తి తెలుసుకోలేరు. ఒకవేళ అన్‌బ్లాక్‌ చేయాలనుకుంటే మళ్లీ అక్కడే అన్‌బ్లాక్‌ ఆప్షన్‌ని ఎంచుకోవాలి.

మెయిల్‌ అన్‌బ్లాక్‌ చేయాలంటే... ఒకవేళ బ్లాక్‌ చేసిన పర్సన్‌తో మళ్లీ మెయిల్స్‌ కాంటాక్ట్స్‌ పునరుద్దరించుకోవాలంటే ఇలా చేయండి. 
  • ఇన్‌బాక్స్‌లో కుడివైపు పైభాగంలో ఉన్న గేర్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేయండి.
  • డ్రాప్‌-డౌన్‌ మెనూ కనిపిస్తుంది. అందులో సెట్టింగ్స్‌పై క్లిక్‌ చేయాలి. ఇప్పుడు మరో విండో కనిపిస్తుంది.
  • ఇందులో ఫిల్టర్స్‌ అండ్‌ బ్లాక్‌ లిస్ట్‌ లింక్‌పై క్లిక్‌ చేయాలి.
  • మీరు బ్లాక్‌ చేసిన సెండర్స్‌ లిస్ట్‌ కనిపిస్తుంది. అందులో ఎవరినైతే అన్‌బ్లాక్‌ చేయాలనుకుంటున్నారో వారి చెక్‌బాక్స్‌ను క్లిక్‌ చేసి అన్‌బ్లాక్‌ను ఎంచుకోవాలి. అంతే.. మళ్లీ వాళ్లు పంపే మెయిల్స్‌ మీ ఇన్‌బాక్స్‌లోకి వస్తుంటాయి.
(ఆంధ్రజ్యోతి వారి సౌజన్యంతో)


Comments

Popular posts from this blog

Twenty Smart Business Buzzwords

List of Cloud Certifications

Navigating the Unknown: Leadership in an Era of Uncertainty