Free Startup Project Report — Kacharagadla

Got a Startup Idea?
Let's Build It Together.

Get a FREE Startup Project Report and expert guidance to turn your vision into reality.

!
Aha, an idea!
We write the report
Your growth begins
Whether it's a first-time venture or your next big pivot — our team helps you map the idea, the market, and the money, so you walk in prepared and walk out funded.

Kacharagadla  •  IB Review

ఫేస్‌బుక్‌ పోటీలో కోటిన్నర గెలిచాం!

మీ.. మా.. మన... వూసులన్నింటికీ ఆన్‌లైన్‌ వేదికనిచ్చే ఫేస్‌బుక్‌ ఆ మధ్య ఓ పోటీ ప్రకటించింది. భారత్‌లోని స్త్రీలకీ, విద్యార్థులకీ, రైతులకీ, వలస కూలీలకీ అంతర్జాలాన్ని చేరువ చేసేలా ‘కొత్తగా మీరేం సృష్టిస్తారు..’ అంటూ సవాలు విసిరింది. ఆ పోటీలో విద్యార్థి విభాగంలో హైదరాబాద్‌కి చెందిన స్టార్టప్‌ ‘బోధ గురు’ మేటిగా నిలిచింది! చిన్నారుల కోసం రెండు కొత్త యాప్‌లు సృష్టించినందుగ్గాను 1.62 కోట్ల రూపాయల్ని బహుమతిగా అందుకుంది. ‘అంతకొత్తగా ఏం చేశారో..?’ అంటూ బోధగురు సైట్‌కి వెళితే కంట్లోపడ్డ తొలి నినాదం ఇది.. ‘దేశంలోని ప్రతి నిరుపేద చిన్నారికీ సాంకేతికతనిస్తాం’ అని! ఆ లక్ష్యసాధన కోసం గత నాలుగున్నరేళ్లుగా పడ్డ శ్రమని ఇలా చెప్పారు సంస్థ సహవ్యవస్థాపకురాలు అనుభా జైన్‌. 
హాయ్‌, ముందు మాకు అవార్డు తెచ్చిపెట్టిన జంట యాప్‌ల గురించి చెప్పేస్తాను. క్రియేటర్‌ యాప్‌, రీడర్‌ యాప్‌ అన్నవి వాటి పేర్లు. పిల్లల మనసు ఎన్నెన్నో వూహలతో నిండి ఉంటుంది. మనదగ్గరా, టీచర్‌ దగ్గరా విన్న కథలన్నింటినీ వాళ్లు తమదైన శైలిలో మార్చుకుంటారు. లేకపోతే కొత్తగా సృష్టించుకుంటారు. ఆ వూహలకి ఓ రూపమివ్వాలనే ప్రయత్నమే ‘క్రియేటర్‌ యాప్‌’. పిల్లలకో కథకి సంబంధించిన వూహ వచ్చిందనుకోండి. వాటిక్కావాల్సిన బొమ్మలూ, రంగులూ, నేపథ్య గళాలూ, సంగీతం, గ్రాఫిక్స్‌.. అన్నీ ఇందులో ఉంటాయి. చిన్నారులు తాము ఓ కథని సృష్టించాలని అనుకోగానే.. ఈ యాప్‌లోకి వెళ్లిపోతే చాలు. మేమిచ్చే బొమ్మలూ, టూల్స్‌తో ఇట్టే చక్కటి కామిక్‌ సిరీస్‌ని తయారుచేయొచ్చు. ఇందుకోసం ఈ యాప్‌లో ఏడువేల బొమ్మల్ని మేం తయారుచేసిపెట్టాం! ఓ పసిపాప నుంచి పండు ముదుసలి దాకా... వివిధ అభినయాలూ, భంగిమలతో ఈ బొమ్మలుంటాయి. వివిధ దేశాల వస్త్రవిశేషాలుంటాయి. అన్ని రకాల జంతువులూ, చెట్లూ, చేమలూ కనిపిస్తాయి. కాపీ రైట్‌ సమస్య రాకుండా వీటన్నింటినీ స్వయంగా మేమే సృష్టించాం. ఇంట్లో ఉన్న స్మార్ట్‌ఫోన్‌, పీసీ, ట్యాబ్లెట్‌లోనూ వీటిని వాడొచ్చు. 

6.5 లక్షల డౌన్‌లోడ్‌లు : ఇలాంటి ప్రయత్నాలు ఇదివరకూ ఎవరూ చేయలేదా అంటే... కొంతవరకు చేశారు. ఆన్‌లైన్‌లో పిల్లల కోసం ఉన్న కుకింగ్‌, డ్రెసింగ్‌ గేమ్స్‌ అలాంటివే. కానీ ఓ కథని సృష్టించే స్థాయిలో ఇన్ని బొమ్మలూ, సాంకేతిక అంశాలని జోడించడం మాతోనే మొదలు. మిగతా వాటిల్లా కేవలం బొమ్మలు ఇవ్వడం కాకుండా.. వాళ్ల సృజనకి పదునుపెట్టే ప్రయత్నం మాది. గత ఏడాది ఏప్రిల్‌లో ఈ ఉచిత యాప్‌ని మార్కెట్‌లోకి తెచ్చాం. స్పందన అపూర్వం. ఆర్నెల్లలోనే పాతికవేల డౌన్‌లోడ్స్‌ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ సంఖ్య 6.5 లక్షలకు చేరింది! తర్వాత పిల్లలు మాత్రమే కాకుండా.. పిల్లలకి నేర్పుగా కథలు చెప్పే తల్లులూ, ఉపాధ్యాయులూ రాసిన కథలకీ అనుమతిచ్చాం. ఇలా రూపొందిన కథకి మేం రేటింగ్‌ పెడతాం. మంచి ఆదరణ ఉన్నవాటిని ఆన్‌లైన్‌ పుస్తకంగా మారుస్తాం. వాటిని ‘రీడర్‌ యాప్‌’లో ఉంచుతాం. అంటే.. ‘క్రియేటర్‌ యాప్‌’తో పిల్లలు రూపొందించిన కథని... మేం పుస్తకంగా మార్చి ‘రీడర్‌ యాప్స్‌’లో పెడతామన్నమాట!! ఆ పుస్తకంపై హక్కులు కూడా పిల్లలవే!! అలా ప్రపంచ నలుమూలల నుంచి కథలొచ్చాయి. ఆంగ్లం, హిందీ, స్పానిష్‌, జర్మనీ భాషల్లో ఉన్నాయివి. వాటితో ఎనిమిది వందల పుస్తకాలు తయారుచేసి.. రీడర్‌ యాప్‌లో ఉంచాం. ఇప్పటిదాకా ఆ పుస్తకాలు మూడు లక్షల డౌన్‌లోడ్స్‌ని సొంతం చేసుకున్నాయి! 
తొలి బహుమతి మాదే : గత ఏప్రిల్‌లో ఫేస్‌బుక్‌ తన ఇంటర్నెట్‌డాట్‌.ఆర్గ్‌ ఆధ్వర్యంలో పోటీని ప్రకటించగానే ఈ వివరాలన్నీ చెబుతూ దరఖాస్తు చేసుకున్నాం. ‘నేటి మన విద్యావ్యవస్థ పిల్లల నుంచి కథల్ని దూరం చేస్తోంది. కానీ పసిమనసుల్లో సృజన కథలతోనే ఏర్పడుతుంది. దానికి ఉదాహరణే మా పుస్తకాలు..’ అని రాశాం. మా యాప్‌ని కూలంకషంగా పరిశీలించి, ఆ నవ్యతని అర్థం చేసుకున్న ఫేస్‌బుక్‌, విద్యార్థి విభాగంలో తొలి బహుమతి మాకు ప్రకటించింది. నజరానా రూ.1.62 కోట్లు! 

మీరేం చేయొచ్చు : మీ పిల్లలకి ప్రతిరోజూ కథలు చెప్పే అలవాటుందా మీకు! అయితే ఆ కథలేవో మా యాప్‌ సాయంతో బొమ్మలతో రాయండి. వాటిని పుస్తకంగా మార్చి.. యాప్స్‌లో ఉంచుతాం. ‘ఐతే.. మాకేంటీ?’ అంటారా... ఈ యాప్‌లని మేం పాఠశాల అవసరాలకు తగ్గట్టు మార్చి అందివ్వాలనుకుంటున్నాం. అందుకోసం స్వల్పంగా ధరలూ నిర్ణయిస్తాం. వాళ్లకిచ్చే యాప్‌లో మీ కథలూ ఉంటే.. ఆ పారితోషికాన్ని మీతోనూ పంచుకుంటాం! అంతేకాదు.. మహిళా రచయితల కోసం యాప్‌లకొచ్చే ప్రకటనల్లోనూ భాగస్వామ్యం కల్పించాలనే ఆలోచన ఉంది. ఫేస్‌బుక్‌ అందించిన బహుమతితో ఇందుకోసం సదస్సులూ నిర్వహించబోతున్నాం! 

మేమూ.. మా సంస్థ : నేను పుట్టింది ఉజ్జయినిలో. మాది వ్యాపార కుటుంబం. కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ చేసి ఎంబీఏలో చేరాను. సమీర్‌ జైన్‌ అక్కడే పరిచయమయ్యాడు. తర్వాత ఇద్దరం బెంగళూరులోని ఓ బహుళజాతి సంస్థలో పనిచేశాం. పెళ్లయ్యాక అమెరికా వెళ్లిపోయాం. ఆయన మైక్రోసాఫ్ట్‌లో చేరాక హైదరాబాద్‌కి వచ్చేశాం. అప్పటికి నేనూ ఉద్యోగ బదిలీ చేయించుకున్నా, పిల్లలు పుట్టాక రాజీనామా చేశాను. మా ఆయన మైక్రోసాఫ్ట్‌ తరఫున హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ బడుల్లో సేవాకార్యక్రమాలు చేపడితే.. నేనూ ఆ పిల్లలకి కథక్‌ నేర్పించేదాన్ని. అప్పుడే ఆ బడుల్లోని పిల్లలు లెక్కలూ, విజ్ఞానశాస్త్రంలో ఎంతో వెనకబడి ఉన్నారని తెలిసింది. 
అందుకని..: ‘పిల్లలకి లెక్కలూ, సైన్స్‌ పాఠాలు సులభంగా అర్థమయ్యేలా.. వాటిని కథల ద్వారా చెప్పించొచ్చు కదా!’ అనుకున్నాం. నేను రంగంలోకి దిగాను. కూడికలూ, తీసివేతలూ, జామెట్రీ... వంటివి కథలతో ఎలా నేర్పించవచ్చో రాసిచూశాను! యానిమేషన్‌గా సృష్టించాను. చిన్నారులకి అవి చాలా నచ్చాయి! దాంతో అలాంటి బోధనా పరికరాల తయారీ లక్ష్యంగా 2011లో ‘బోధగురు’ సంస్థని స్టార్టప్‌గా ప్రారంభించాం. ఒకటి నుంచి ఎనిమిదేళ్ల పిల్లల కోసం తెలుగు, ఇంగ్లిషు, హిందీలో వేయికిపైగా వీడియోలు సృష్టించాం. అరవైకి పైగా యాప్‌లూ ఉన్నాయి. పిల్లలకే కాకుండా.. ప్రభుత్వ/ఎయిడెడ్‌ పాఠశాల బడుల్లోని ఉపాధ్యాయులకి ఉపయోగపడేలా వీటిని రూపొందించాం. వీటన్నింటినీ కలిపి ఓ కిట్‌గా తయారుచేశాం. వాటిలో ప్రతిదాన్నీ పాతికవేల రూపాయలకు విక్రయిస్తున్నాం. నిరుపేద చిన్నారుల కోసమని చెప్పి అంత ధర పెడితే ఎలాగని అనుకోవద్దు... వీటిని స్వచ్ఛంద సంస్థల సాయంతోనే బడులకి అప్పగిస్తున్నాం. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 150 బడులకి వీటిని అందించాం. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న ‘రెయిన్‌బో బడులు’ వీటిని చక్కగా వినియోగించుకున్నాయి. ఈ పిల్లల్లో మా ఉపకరణాల వల్ల గణితం, సైన్స్‌పై అవగాహన ఇదివరకంటే 60 శాతం పెరిగిందని ఓ స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో తేలింది! అంతేకాదు.. మా పాఠాలని యూట్యూబ్‌లో ఉచితంగానూ చూడొచ్చు. ఇంతదాకా అలా పాఠాలని పదిలక్షల మంది వీక్షించారు. 

కన్నీళ్లూ ఉన్నాయి: స్టార్టప్‌ అంటే.. నల్లేరుపై నడక కాదు. అడుగడుగునా మమ్మల్ని ఆర్థిక సమస్యలు వేధించేవి. మేం అప్పటిదాకా పొదుపు చేసిన మొత్తం, స్నేహితుల నుంచి తీసుకున్న రుణాలన్నీ కలిపి 1.25 కోట్ల రూపాయలతో ఈ సంస్థ ప్రారంభించాం. మొదట మేమిద్దరం, తరవాత పదిహేనుమంది సిబ్బంది. కానీ ఒక్క యానిమేషన్‌ వీడియోకే వేలాదిరూపాయలయ్యేవి. ఓ స్థాయిలో ఆ ఖర్చు తట్టుకోలేకపోయాం. సిబ్బందినీ తగ్గించుకోవాలనుకున్నాం. సంస్థ మొదలుపెట్టినప్పటి నుంచీ ‘దీదీ’ అంటూ నాతో ఉన్న వాళ్లందరినీ మనసు రాయిచేసుకుని మరీ వెళ్లిపొమ్మని చెప్పాల్సిన పరిస్థితి. కొందరికి నేనే వేరే సంస్థలో ఉద్యోగాలు చూపించాను. గత ఏడాది రూ.35 లక్షల టర్నోవర్‌ వచ్చింది. దాంతోనే ఈ క్రియేటర్‌, రీడర్‌ యాప్‌లకు పెట్టుబడి పెట్టాం. ఇంతలో అమెరికాలోని ఐదువేల లైబ్రరీల్లో మా కిట్‌ని ఉపయోగించుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నాం. వాటితో ఈ ఏడాది మా టర్నోవరు కోటి దాటేస్తుంది! ఫేస్‌బుక్‌ గుర్తింపు మా అవకాశాల్ని మరింత పెంచుతుందని నమ్ముతున్నాను! 
(ఈనాడు వారి సౌజన్యం తో)

Comments

Popular posts from this blog

Twenty Smart Business Buzzwords

List of Cloud Certifications

Navigating the Unknown: Leadership in an Era of Uncertainty