ఆంధ్రప్రదేశ్‌లో ఆసుస్‌ ఫోన్ల తయారీ

జెన్‌ఫోన్‌ 2 లేజర్‌ సిరీస్‌తో మొదలు
ఫాక్స్‌కాన్‌తో కాంట్రాక్టు తయారీ ఒప్పందం

స్మార్ట్‌ఫోన్ల విపణిలో వేగంగా విస్తరిస్తున్న ఆసుస్‌, తన జెన్‌ సిరీస్‌ ఫోన్లను ఆంధ్రప్రదేశ్‌లో తయారు చేయనుంది. ఇందుకోసం తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌తో కాంట్రాక్టు తయారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఫాక్స్‌కాన్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలో స్మార్టఫోన్ల తయారీ యూనిట్‌ ఉన్న సంగతి విదితమే. అక్కడే ఆసుస్‌ ఫోన్ల తయారీ చేపడతారు. స్థానికంగా స్మార్ట్‌ఫోన్ల తయారీ చేపట్టడం వల్ల భారతదేశంలో వేగంగా విస్తరించేందుకు అవకాశం కలుగుతుందని ఆసుస్‌ భావిస్తోంది. జెన్‌ఫోన్‌ 2 లేసర్‌ సిరీస్‌ ఫోన్లను ముందుగా ఆంధ్రప్రదేశ్‌లో తయారు చేస్తామని, తర్వాత జెన్‌ఫోన్‌ గో సిరీస్‌ ఫోన్ల తయారీ కూడా ఇక్కడే జరుగుతుందని ఆసుస్‌ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతం లోగా నెలకు కనీసం 1.50 లక్షల స్మార్ట్‌ఫోన్లను దేశీయంగా తయారు చేయాలని ఆసుస్‌ నిర్ణయించుకుంది. దేశీయంగా ఆసుస్‌ నమోదు చేస్తున్న అమ్మకాల్లో ఇది దాదాపు 80 శాతానికి సమానం.

ఇప్పటికీ స్మార్ట్‌ వాటా 10 శాతమే: దేశీయ మొబైల్‌ ఫోన్ల విపణిలో స్మార్ట్‌ఫోన్ల వాటా 10 శాతమేనని, అందువల్ల సమీప భవిష్యత్తులో స్మార్ట్‌ఫోన్లకు మంచి గిరాకీ వస్తుందని అంచనా వేస్తున్నట్లు ఆసుస్‌ ఇండియా కంట్రీ మేనేజర్‌, దక్షిణాసియా వ్యవహారాల అధిపతి అయిన పీటర్‌ ఛాంగ్‌ అన్నారు. భారత్‌ తయారీ కార్యక్రమం అంతర్జాతీయ కంపెనీలకు ఎన్నో అవకాశాలు కల్పిస్తోందని, దీన్ని అందిపుచ్చుకునేందుకు తాము ముందుకు వచ్చామని, ఈ విపణిపై తాము ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు పీటర్‌ చాంగ్‌ చెప్పారు. వచ్చే ఏడాది చివరి నాటికి భారతదేశంలో 5 శాతం మార్కెట్‌ వాటా సాధించాలనేది తమ లక్ష్యమని వివరించారు. గత నెలలో ఆసుస్‌ నిర్వహించిన ‘జెన్‌ ఫెస్టివల్‌’ లో జెన్‌ఫోన్‌ సెల్ఫీ, జెన్‌ఫోన్‌ 2 లేజర్‌, జెన్‌ఫోన్‌ 2 డీలక్స్‌ సిరీస్‌ ఫోన్లను ఆసుస్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. జెన్‌ఫోన్‌ 2 లేజర్‌, మనదేశంలో ఆసుస్‌ తయారు చేయనున్న తొలి స్మార్ట్‌ఫోన్‌. దీనికి వినియోగదార్ల నుంచి మెరుగైన స్పందన ఉన్నట్లు కంపెనీ వివరించింది.

Comments

Popular posts from this blog

Twenty Smart Business Buzzwords

Navigating the Unknown: Leadership in an Era of Uncertainty

List of Cloud Certifications