Skip to main content

ఎయిర్‌టెల్‌ రూ.3,100 కోట్ల పెట్టుబడి

    • 4జి, 3జి సేవల విస్తరణపై దృష్టి 
    • రెండో త్రైమాసిక లాభం రూ.1,523 కోట్లు 
    • ఆదుకున్న డేటా ఆదాయం 
    • రూ.70,777 కోట్లకు చేరిన అప్పులు 

    న్యూఢిల్లీ: 4జి టెలికాం సేవలతోపాటు 3జి సేవల విస్తరణ కోసం భారతి ఎయిర్‌టెల్‌ మరిన్ని పెట్టుబడులకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరం రూ.3,101.5 కోట్లు ఖర్చు చేయాలని భావిస్తోంది. రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించిన సందర్భంగా కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గోపాల్‌ విఠల్‌ ఈ విషయం చెప్పారు. ఇందులో ఎక్కువ భాగాన్ని కంపెనీ డేటా సామర్ధ్యం విస్తరణ కోసం కేటాయించింది. 2015 సెప్టెంబర్‌ చివరినాటికి కంపెనీ నికర అప్పుల భారం రూ.70,777 కోట్లుగా ఉంది.

    అంచనాలు మించిన లాభం 
    సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో భారతి ఎయిర్‌టెల్‌ ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ వర్గాల అంచనాలను మించాయి. ఈ కాలానికి కంపెనీ రూ.23,836 కోట్ల స్థూల ఆదాయంపై రూ.1,523 కోట్ల సమీకృత నికర లాభం ఆర్జించింది. నికర లాభంలో రూ.660 కోట్లు ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా టెలికం టవర్ల అమ్మకం ద్వారా సమకూరింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ ఆదాయం 4.3 శాతం, నికర లాభం 10.1 శాతం పెరిగాయి. అయితే జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంతో పోలిస్తే మాత్రం కంపెనీ నికర లాభం రెండు శాతం పడిపోయింది. ఆదాయం సైతం 0.7 శాతం మాత్రమే పెరిగింది.
    డేటా రాబడి బాగుబాగు.. 
    డేటా వినియోగం 76.3 శాతం పెరగడం రెండో త్రైమాసికంలో ఎయిర్‌టెల్‌కు బాగా కలిసొచ్చింది. దీంతో డేటా ట్రాఫిక్‌ ద్వారా వచ్చే ఆదాయం 49.8 శాతం పెరిగి రూ.3,806 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మొత్తం ఆదాయంలో మొబైల్‌ డేటా ఆదాయం వాటా 14.5 శాతం నుంచి 21.5 శాతానికి పెరిగింది. ఒక్కో డేటా వినియోగదారుడి నుంచి లభించే సగటు ఆదాయం సైతం రూ.42 పెరిగి రూ.193కు చేరింది. ఇదే కాలంలో సగటు డేటా వినియోగం 35.9 శాతం పెరిగింది.
    ఆఫ్రికాలో ఇంకా నష్టాలే 
    రెండో త్రైమాసికంలోనూ ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా విభాగం 17 కోట్ల డాలర్ల నష్టాలు చవిచూసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నష్టాలు 6.6 కోట్ల డాలర్లు పెరిగాయి. అయితే టవర్ల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే రెండో త్రైమాసికంలో ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా ఆదాయం 5.1 శాతం పెరిగి 102.8 కోట్ల డాలర్లకు పెరిగాయి. కంపెనీ ఆఫ్రికా విభాగం గత నాలుగు త్రైమాసికాల్లో ఎన్నడూ ఈ స్థాయిలో ఆదాయం ఆర్జించలేదని పేర్కొంది. ఎయిర్‌టెల్‌ ఆఫ్రికాకు చెందిన టెలికాం టవర్ల అమ్మకం ద్వారా కంపెనీకి రెండో త్రైమాసికంలో 170 కోట్ల డాలర్ల ఆదాయం లభించింది. ఇదే కాలంలో వాయిస్‌ ఆధారిత టెలికం సేవల డిమాండ్‌ 19.5 శాతం, డేటా ఆధారిత సేవల డిమాండ్‌ 104.5 శాతం పెరిగాయని ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా కంపెనీ ఎండి, సిఇఒ క్రిస్టియన్‌ డి ఫారియా చెప్పారు.

    భవిష్యత్‌ ఆశాజనకం 
    కంపెనీ ఇప్పటికే దేశ వ్యాప్తంగా 334 పట్టణాలు, నగరాల్లో 4జి సేవలు ప్రారంభించింది. 3జి సేవలకు దూ రంగా ఉన్న సర్కిల్స్‌లోనూ 3జి సేవలు ప్రారంభించింది. దీంతో మున్ముందు డేటా ట్రాఫిక్‌ మరింత పెరిగి మంచి ఆర్థిక ఫలితాలు సాధించగలమని ఆశిస్తోంది.

    Comments