Free Startup Project Report — Kacharagadla

Got a Startup Idea?
Let's Build It Together.

Get a FREE Startup Project Report and expert guidance to turn your vision into reality.

!
Aha, an idea!
We write the report
Your growth begins
Whether it's a first-time venture or your next big pivot — our team helps you map the idea, the market, and the money, so you walk in prepared and walk out funded.

Kacharagadla  •  IB Review

ప్రజ్వలించిన పరిశోధన

కక్ష్యలోకి ఆస్ట్రోశాట్‌ 
నమ్మకం వమ్ము చేయని పీఎస్‌ఎల్‌వీ 
మరో ఆరు విదేశీ ఉపగ్రహాలనూ కక్ష్యలోకి చేర్చిన రాకెట్‌ 
విశ్వంపై పరిశోధనలకు వీలు 
శ్రీహరికోట : అంతరిక్ష రంగంలో భారత్‌ మరోసారి వెలుగులీనింది. నక్షత్రాలు, ఖగోళశాస్త్ర పరిశోధనల కోసం తొలిసారిగా ఆస్ట్రోశాట్‌ ఉపగ్రహాన్ని విజయవంతంగా రోదసిలోకి పంపింది. ఈ ఘనత సాధించిన అతికొద్ది దేశాల సరసన సగర్వంగా చేరింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు అచ్చొచ్చిన పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారానే ఈ విజయయాత్ర సాగింది. దీంతోపాటు విదేశాలకు చెందిన మరో ఆరు ఉపగ్రహాలను కూడా గురి తప్పకుండా నిర్దిష్ట కక్ష్యల్లోకి ఈ వాహకనౌక ప్రవేశపెట్టింది. తొలిసారిగా అమెరికాకు చెందిన ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించడం విశేషం. నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ ఇందుకు వేదికగా నిలిచింది. 

తాజా ప్రయోగం కోసం శనివారం ఉదయం 8.00 గంటలకు ప్రారంభమైన 50 గంటల కౌంట్‌డౌన్‌ ప్రక్రియ సోమవారం ఉదయం 10.00 గంటలకు ముగిసింది. ఆ వెంటనే పీఎస్‌ఎల్‌వీ-సి30 రాకెట్‌లో మొదటి దశ ప్రజ్వలించింది. ఆస్ట్రోశాట్‌తోపాటు విదేశాలకు చెందిన మరో ఆరు ఉపగ్రహాలను మోసుకుంటూ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. వీటన్నింటి బరువు 1631 కిలోలు. ఈ ప్రయోగం కోసం ఇస్రో.. భారీ పీఎస్‌ఎల్‌వీ రకాన్ని (ఎక్స్‌ఎల్‌ వెర్షన్‌) ఉపయోగించింది. ఇందులో అదనంగా ఆరు స్ట్రాపాన్‌ మోటార్లు ఉన్నాయి. రాకెట్‌లోని నాలుగు దశలూ ఒకదాని వెంట ఒకటి.. నిర్దేశించిన రీతిలో అద్భుతంగా పనిచేశాయి. పైకి లేచిన 22 నిమిషాల తర్వాత 1513 కిలోల ఆస్ట్రోశాట్‌.. భూమికి ఎగువన 650 కిలోమీటర్ల ఎత్తులో రాకెట్‌ నుంచి విడిపోయింది. ఆ తర్వాత మూడు నిమిషాలకు లపన్‌-ఎ2 (ఇండొనేషియా), ఎన్‌ఎల్‌ఎస్‌-14 (కెనడా), అమెరికాలోని స్పైర్‌ గ్లోబల్‌ సంస్థకు చెందిన నాలుగు ఏకరూప లెముర్‌ నానో ఉపగ్రహాలు కూడా నిర్దేశిత కక్ష్యల్లోకి అత్యంత కచ్చితత్వంతో చేరిపోయాయి. 

అమెరికా ఉపగ్రహాలను భారత్‌ ప్రయోగించడం ఇదే మొదటిసారి. లోగడ ఆంక్షలతో ఇస్రోను ఇబ్బంది పెట్టిన అమెరికా.. చౌక ప్రయోగాలు, పీఎస్‌ఎల్‌వీ విజయాల నేపథ్యంలో ఇప్పుడు మన తలుపు తడుతోంది. ఈ వాహకనౌకకు ఇది 31వ ప్రయోగం. వీటిలో మొదటిది మినహా అన్నీ విజయవంతమయ్యాయి. తాజా ప్రయోగంతో కలిపి 84 ఉపగ్రహాలను దిగ్విజయంగా కక్ష్యలోకి పంపి, అత్యంత విశ్వసనీయ రాకెట్‌గా గుర్తింపు పొందింది. ఈ ఉపగ్రహాల్లో 51.. విదేశాలవి కావడం గమనార్హం. కక్ష్యలోకి చేరిన ఆస్ట్రోశాట్‌కు సంబంధించిన రెండు సౌర ఫలకాలు.. ముందుగా నిర్దేశించిన రీతిలో విచ్చుకున్నాయి. బెంగళూరులోని ఇస్రోకు చెందిన టెలీమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ (ఇస్‌ట్రాక్‌) దాని నియంత్రణ బాధ్యతలను స్వీకరించింది. ఉపగ్రహం ‘ఆరోగ్యంగానే’ ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వచ్చే రెండు నెలల్లో దీన్ని వినియోగంలోకి తీసుకురానున్నారు. 

ఎందుకు?: 
ఆస్ట్రోశాట్‌ చాలా విశిష్ట, అధునాతన ఉపగ్రహం. విశ్వం ఆవిర్భావం, అందులో అంతుచిక్కని అంశాలు, దాని రేడియోధార్మికత తీరు, వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. 

చౌకలోనే: 
పూర్తిగా ఖగోళశాస్త్ర పరిశోధనల కోసమే ఒక ఉపగ్రహాన్ని భారత్‌ ప్రయోగించడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకూ వేరే అవసరాల కోసం పంపిన ఉపగ్రహాల్లో.. ఖగోళ అధ్యయనాల కోసం కొన్ని పరికరాలను మాత్రమే పంపింది. కేవలం రూ.450 కోట్లతో అంగారక గ్రహం వద్దకు ఒక ఉపగ్రహాన్ని (మామ్‌) పంపి, ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన ఇస్రో.. ఆస్ట్రోశాట్‌ను కూడా చౌకలోనే రూపొందించింది. దీనికి రూ.178 కోట్లు వ్యయం చేసింది. ఇప్పటివరకూ అమెరికా, జపాన్‌, రష్యా, ఐరోపాలు మాత్రమే ఖగోళ అధ్యయనాల కోసం అబ్జర్వేటరీలను పంపాయి. భారత్‌ తాజాగా వీటి సరసన చేరింది. 

అధునాతన పరికరాలు 
ఆస్ట్రోశాట్‌ ఐదేళ్ల పాటు సేవలు అందిస్తుంది. ఇందులో అత్యంత సున్నితమైన ఐదు పరికరాలు ఉన్నాయి. ఇవి విద్యుదయస్కాంత స్పెక్ట్రమ్‌లోని దృశ్య, అతినీలలోహిత, మృదువైన ఎక్స్‌రే, కఠిన ఎక్స్‌రే పరిధుల్లో విశ్వాన్ని పరిశీలిస్తాయి. ప్రస్తుతమున్న సైన్స్‌ ఉపగ్రహాల్లో ఎక్కువ శాతం.. ఇన్ని తరంగ దైర్ఘ్యాల్లో పరిశీలనలు చేయలేవు. విశ్వ కణాల తీవ్రత సమయాన్నిబట్టి మారుతూ ఉంటుంది. దీనిని ఏకకాలంలో పరిశీలించాలి. ఆస్ట్రోశాట్‌.. ఈ లక్ష్యాన్ని నెరవేరుస్తుంది. ఇది ఏకకాలంలో బహుళ తరంగ దైర్ఘ్యాల్లో విస్తృత పరిశోధనలు చేస్తుంది. అందులోని పరికరాలివీ.. 

* మూడు ఏకరూప విస్తృత పరిధి జెనాన్‌ ఫీల్డ్‌ ప్రపోర్షనల్‌ కౌంటర్లు (ఎల్‌ఏఎక్స్‌ పీసీ). 
* క్యాడ్మియమ్‌ జింక్‌ టెల్లురైడ్‌ (సీజడ్‌టీ) అరే విత్‌ కోడెడ్‌ మాస్క్‌ అపర్చర్‌ సెన్సిటివ్‌. 
* సాఫ్ట్‌ ఎక్స్‌రే ఇమేజింగ్‌ టెలిస్కోపు (ఎస్‌ఎక్స్‌టీ). 
* ఆకాశ అధ్యయన పరికరం(స్కానింగ్‌ స్కై మానిటర్‌)(ఎస్‌ఎస్‌ఎం). 
* అతినీల లోహిత కిరణాలను చిత్రీకరించే(ఇమేజింగ్‌) టెలిస్కోపు (యూవీఐటీ). 

ఈ పరికరాలు.. తారల్లోని అయస్కాంత క్షేత్రాలు, గెలాక్సీల్లోని కృష్ణబిలాలు, న్యూట్రాన్‌ నక్షత్రాలు, పల్సార్లు, శ్వేత మరుగుజ్జు నక్షత్రాలు, క్వాసార్లు, క్రియాశీల రేణువులను పరిశీలించి, ఆ వివరాలను భూమికి పంపుతాయి. 

విస్తృత భాగస్వామ్యం: 
ఆస్ట్రోశాట్‌ రూపకల్పనలో ఇస్రో, ముంబయిలోని టాటా ఇన్స్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌(టీఐఎఫ్‌ఆర్‌), పుణెలోని ఇంటర్‌ యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రానమి అండ్‌ ఆస్ట్రో ఫిజిక్స్‌(ఐయూసీఏఏ), బెంగళూరులోని ఇండియన్‌ ఇన్స్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రో ఫిజిక్స్‌(ఐఐఏపీ), రామన్‌ పరిశోధన కేంద్రం (ఆర్‌ఆర్‌ఐ), బ్రిటన్‌లోని లీసెస్టర్‌ విశ్వవిద్యాలయం, కెనడా అంతరిక్ష సంస్థ (సీఎస్‌ఏ)లు భాగస్వామ్యం వహించాయి. 

చైనాకు మరోసారి కంగు.. 

అంతరిక్ష రంగంలో భారత్‌, చైనాల మధ్య పోటీ ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. మానవసహిత అంతరిక్ష యాత్రలు, చంద్రుడిపైకి రోవర్‌ను దించడం ద్వారా చైనా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అయితే అంగారక యాత్ర విషయంలో మాత్రం ఆ దేశాన్ని భారత్‌ మట్టి కరిపించింది. ఆ గ్రహానికి తానే ముందు ఉపగ్రహాన్ని విజయవంతంగా పంపింది. ఖగోళశాస్త్ర అధ్యయన ఉపగ్రహం విషయంలోనూ భారత్‌దే ఆధిపత్యం. ఆస్ట్రోశాట్‌ లాంటి ఉపగ్రహం ఇప్పటివరకూ చైనా వద్ద లేకపోవడమే ఇందుకు కారణం. ఇందుకు ఆ దేశానికి మరికొన్నేళ్లు పడుతుంది.
మూలం: ఈనాడు

Comments

Popular posts from this blog

Twenty Smart Business Buzzwords

List of Cloud Certifications

Navigating the Unknown: Leadership in an Era of Uncertainty