Skip to main content

నమస్తే...బాస్‌!

ఎవరి శైలి వారిది. ఎవరి ప్రత్యేకతలు వారివి. ఒక బాసు బాకులా పదునుగా వ్యవహరిస్తాడు. ఒక బాసు కేకులా తీయగా మాట్లాడతాడు. ఒకరు పట్టిందల్లా బంగారమైతే, మరొకరు ఏకంగా బంగారాన్నే పట్టేసుకోగలరు. నేర్చుకునే మనసుంటే - ప్రతి బాసూ ఓ గెలుపు పాఠమే! అక్టోబరు 16, ప్రపంచ బాసుల దినోత్సవం. ఆ సందర్భంగా ఉత్తమ బాసుల్ని గుర్తుచేసుకుంటూ, బాసోత్తములకు ‘హ్యాపీ బాస్‌ డే!’ చెబుతూ... 


తీక్షణమైన చూపుల వెనుక, ఎవరూ గమనించని అంతర్‌ దృష్టి ఒకటుంటుంది. ఆ నిటారు నడకను చూస్తే గురితప్పని బాణమేదో స్ఫురణకు వస్తుంది. విజయాలకు పొంగిపోనీ అపజయాలకు కుంగిపోనీ ఆ సహజ గాంభీర్యం గీతాచార్యుడి స్థితప్రజ్ఞుడిని కళ్లముందు నిలుపుతుంది. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసే ఆ ‘క్వశ్చన్‌ బ్యాంకు’ మనస్తత్వంలో అంతులేని జిజ్ఞాసా ఓ భాగమే. అంతర్ముఖుడేమో అనుకుంటాం కానీ, ఓ బలమైన వ్యవస్థను సృష్టించడంలో అచ్చంగా చతుర్ముఖుడే! ఆ ఫుల్‌సూట్‌, అతనో పరిపూర్ణ వ్యక్తి అన్న విషయాన్ని చెప్పకనే చెబుతుంది. ఫైళ్ల బరువుతో ఓపక్కకి వాలినట్టున్న భుజం...కీలక బాధ్యతలు మోస్తున్నాడనడానికి బండగుర్తు. అలవోకగా ఉటంకించే మేనేజ్‌మెంట్‌ సూక్తులు అతన్లోని చదువరిని పట్టిస్తాయి. పన్లో పడ్డాడంటే మాత్రం, తపస్సుకు కూర్చున్న మహర్షే! కార్పొరేట్‌ పరమపద సోపానంలో...పాముల్ని ఒడుపుగా దాటేసుకుని, నిచ్చెనల్ని తెలివిగా పట్టేసుకుని అంతెత్తుకు ఎదగడమంటే మాటలు కాదు - బాస్‌...తుస్సీ గ్రేట్‌ హో!

అదానీ, కుమార్‌ మంగళం బిర్లా, ఉదయ్‌ కొటక్‌, చందాకొచ్చర్‌ - మహామహా బాసుల విజయ రహస్యాలన్నీ ఓచోట కుప్పగాపోస్తే...అంతకు మించిన వికాస గ్రంథం ఏం ఉంటుంది?

ఓటమికి వందనం... 
ఎవరన్నారు ఓటమి అనాథ అనీ, గెలుపుకే బంధుగణం ఎక్కువనీ! నిజమైన బాస్‌ పరమశివుడి లాంటివాడు. గెలుపు అమృతాన్ని అందరికీ పంచి, ఓటమి గరళాన్ని మాత్రం తానొక్కడే గొంతులో పోసుకుంటాడు, సిబ్బంది లోపాల్నీ సంస్థ పరిమితుల్నీ భద్రంగా కడుపులో దాచుకుంటాడు. ఆ ప్రకారంగా, అదానీ గ్రూప్‌ వ్యవస్థాపకుడు గౌతమ్‌ అదానీ అచ్చమైన నీలకంఠుడే. ఓసారి, ఓ ఉద్యోగి నిర్లక్ష్యం కారణంగా కంపెనీకి భారీ నష్టమే వచ్చింది. ఆ చిరుద్యోగికి రాత్రంతా నిద్రపట్టలేదు. మరుసటిరోజు బిక్కుబిక్కుమంటూ ఆఫీసుకు వెళ్లాడు. నేరుగా వెళ్లి అదానీ చేతిలో రాజీనామా లేఖ పెట్టాడు.‘నిజమే, చాలా పెద్ద నష్టమే. ఆ అనుభవం మనకో పాఠం. అంత గొప్ప పాఠం నేర్చుకున్న ఉద్యోగి నా దృష్టిలో చాలా విలువైనవాడు. నిన్ను వదిలిపెట్టుకునే ప్రసక్తే లేదు. వెళ్లి ప్రశాంతంగా పనిచేసుకో..’ - ఎప్పట్లానే గాంభీర్యమూ ఆత్మీయతా కలగలిసిన స్వరంతో చెప్పాడు అదానీ. పదిహేడేళ్ల నాటి సంఘటన ఇది. ఆ సాధారణ ఉద్యోగి ప్రస్తుతం జనరల్‌ మేనేజరు స్థాయిలో ఉన్నాడు. అదానీ పరివార సంస్థల్లో ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. గౌతమ్‌ అదానీ కుబేరుల వంశంలో ఏం పుట్టలేదు. పక్కా మధ్యతరగతి కుటుంబం. చేతిలో పట్టా కూడా లేకుండా ముంబయి మహానగరానికి వలస వచ్చేశాడు. వజ్రాలకు సంబంధించిన కోర్సు చేసి...డైమండ్‌ సార్టర్‌గా ఉద్యోగం సంపాదించాడు. అనుభవం వచ్చాక వజ్రాల మధ్యవర్తిగా మారాడు. మెల్లగా ఎగుమతి వ్యాపారంలో కాలుమోపాడు. పోర్టులు, విద్యుత్‌ ఉత్పత్తి, మైనింగ్‌ తదితర రంగాలకు విస్తరించాడు. ఆ ప్రయాణంలో కొన్ని ఎదురుదెబ్బలూ తగిలాయి. కాబట్టే, ఆయనకు వైఫల్యమంటే అంత గౌరవం. ‘చాలామందికి కళ్లు తెరిచినప్పుడు కూడా కనిపించనివి, మా బాస్‌కు మాత్రం కళ్లు మూసుకున్నప్పుడూ కనిపిస్తాయి’ అని గర్వంగా చెబుతుంటారు అదానీ సంస్థల ఉద్యోగులు. దీర్ఘంగా ఆలోచిస్తున్నప్పుడు కళ్లు మూసుకోవడం అదానీ అలవాటు. ‘ఫస్ట్‌ లాస్‌.. బెస్ట్‌ లాస్‌’ అంటుంటారాయన. మొదటి ఓటమి మాస్టారి బెత్తం దెబ్బ లాంటిది. గాయం మానిపోయినా, అనుభవం మాత్రం గుర్తుండిపోతుంది. ఇంకో తప్పు చేస్తే చేయొచ్చుకానీ, అచ్చంగా అలాంటి తప్పు మాత్రం ఇంకెప్పుడూ చేయం. ఏ బాసైనా కోరుకునేదీ అదే.


ఎంత సున్నితమో అంత... 
ఎదుటి వ్యక్తి అభిప్రాయాన్ని ఆమోదించవచ్చు, ఆమోదించక పోనూవచ్చు. కానీ, గౌరవించాలి. ఆ సంస్కారం ఆదిత్య బిర్లా గ్రూప్‌ అధినేత కుమార్‌ మంగళం బిర్లాలో పుష్కలం. కుమార్‌ మంగళం శాకాహారి. మాంసం తినడం అంటే, ప్రత్యక్షంగానో పరోక్షంగానో మూగజీవుల్ని హింసించడమే అని నమ్ముతాడు. తమ కంపెనీ క్యాంటీన్లలో శాకాహారాన్ని మాత్రమే అందిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చిందోసారి. ఆ మేరకు ఆదేశాలు తయారు చేయమని సిబ్బందికి చెప్పాడు. ఆదిత్య బిర్లా సంస్థల్లో భిన్న ప్రాంతాలవారూ, భిన్న సంస్కృతులవారూ పనిచేస్తున్నారు. విదేశీయుల సంఖ్యా తక్కువేం కాదు. మాంసాహారం చాలామంది జీవితంలో ఓ భాగం. ఆ నిర్ణయం వల్ల వాళ్లంతా ఇబ్బందిపడవచ్చు. అదే మాట చెప్పారు ఉన్నతాధికారులు. ఈ విషయంలో మరింత చర్చ అవసరమేమో అనిపించింది. చాలా మందితో మాట్లాడాడు. అన్నిచోట్లా వ్యతిరేకత వ్యక్తమైంది. ‘వ్యక్తిగత అభిప్రాయాన్ని సంస్థ ఉద్యోగుల మీద రుద్దడం నాకిష్టం లేదు. అలానే కానివ్వండి’ అంటూ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు కుమార్‌ మంగళం. కొన్ని విషయాల్లో మాత్రం ఆయన నిర్ణయాలు మహాస్థిరంగా ఉంటాయి. భారీమొత్తానికి అమెరికా సంస్థ కొలంబియన్‌ కెమికల్స్‌ను కొనుగోలు చేయాలనుకున్నప్పుడు, దాదాపుగా సీనియర్ల బృందమంతా వ్యతిరేకించింది. అంత ధర అనవసరమని తేల్చి చెప్పింది. అయినా కుమార్‌ మంగళం నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇప్పుడు, కార్బన్‌ బ్లాకుల వ్యాపారంలో బిర్లాలదే పైచేయి. నాయకుడు అనేవాడు సందర్భాన్ని బట్టి పువ్వంత మృదువుగా ఉండాలనీ, వజ్రమంత కఠినంగానూ మారాలనీ చాణక్యనీతి చెబుతుంది. నాయకుడూ బాసూ వేరువేరు కాదు. నిపుణుడైన నాయకుడే బాస్‌!


బాసులూ అభిరుచులూ!
హెచ్‌డీఎఫ్‌సీ ఛైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ క్యాబిన్‌లో నల్లని వినాయకుడి విగ్రహం ఉంటుంది. మూడు దశాబ్దాల క్రితం హెచ్‌డీఎఫ్‌సీలో చేరుతున్న సందర్భంగా వాళ్లావిడ ఆయనకిచ్చిన బహుమతి అది. ప్రతి రాత్రీ పడుకునే ముందు ఒక్క సుడొకు అయినా పూరించడం ఆయన అలవాటు. అదీ కాగితం మీద కాదు. లెక్కలన్నీ మనసులోనే. 


జిమ్‌ ప్రేమ్‌జీ నిజాయతీని గౌరవిస్తారు. ఓ తయారీ విభాగానికి విద్యుత్‌ సరఫరా చేయడానికి ప్రభుత్వ ఇంజినీరు లక్ష రూపాయలు లంచం అడిగాడోసారి. కోట్ల రూపాయల విలువైన పరిశ్రమను స్థాపించినవారికి అదేమంత పెద్దమొత్తం కాకపోవచ్చు. కానీ, లంచాల్ని ప్రోత్సహించకూడదన్నది ప్రేమ్‌జీ నియమం. దీంతో జనరేటర్లు పెట్టి విద్యుత్తు ఉత్పత్తి చేసుకున్నారు. అందుకు కోటి రూపాయలు ఖర్చు అయినా సరే! 
దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరు నటరాజన్‌ చంద్రశేఖరన్‌ మారథాన్‌ ప్రియుడు. ఎక్కడ మారథాన్‌ జరిగినా పాల్గొనే ప్రయత్నం చేస్తారు. ఆయన చేతికి ఆపిల్‌ వాచీ పెట్టుకుంటారు. అందులోని ‘హెల్త్‌ ఆప్స్‌’ అంటే మహా ఇష్టం. 

మారికో ఛైర్మన్‌ హర్ష్‌ మారివాలా పుస్తక ప్రియుడు. నెలకో పుస్తకమైనా చదవాలని నియమం పెట్టుకున్నారు. వారాంతాలూ విమాన ప్రయాణాలూ, కార్లో ఆఫీసుకు వస్తున్నప్పుడూ ఇంటికి వెళ్తున్నప్పుడూ, ఎవరికోసమైనా ఎదురుచూస్తున్నప్పుడూ... బ్రీఫ్‌కేస్‌ లోంచి పుస్తకం బయటికి వచ్చేస్తుంది. 
జాజ్‌ ఆటోమొబైల్స్‌ డైరెక్టరు రాజీవ్‌ బజాజ్‌...కంప్యూటరు మీద పనిచేయరు, ఫార్మల్‌సూట్‌లో ఆఫీసుకురారు, మార్కెట్‌ సర్వేలను నమ్మరు, సాధ్యమైనంత వరకూ ఇంగ్లిషు మందులకు దూరంగా ఉంటారు. బజాజ్‌ కుటుంబం హోమియోపతి వైపే మొగ్గుచూపుతుంది. 

కొటక్‌ మహీంద్రా బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టరు ఉదయ్‌ కొటక్‌ అదృష్ట సంఖ్య ...పదమూడు! ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు పదమూడు మందితో ఓ కమిటీని ఏర్పాటు చేయడం అలవాటు. ఓ కీలక సమావేశానికి పన్నెండుమంది మాత్రమే హాజరయ్యారు. ఓ జూనియర్‌ అధికారి ఎందుకో రాలేకపోయాడు. ఇరవై నిమిషాలు ఎదురుచూసి మరీ...పదమూడు తలలు కనిపించాకే సమావేశాన్ని ప్రారంభించారని వినికిడి. 

ఎదుగూ ఎదగనివ్వు... 

నిజమైన బాస్‌ సోషలిస్టులా వ్యవహరిస్తాడు. తాను ఎదుగుతూ ఉద్యోగుల్నీ ఎదగనిస్తాడు - కొటక్‌ మహీంద్రా బ్యాంకు ఎండీ ఉదయ్‌ కొటక్‌లా! సంస్థ పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లడానికి కాస్త ముందు...చాలామంది ఉద్యోగులకు ఆయన నామమాత్రపు ధరకే వాటాలు ఇచ్చాడు. కొందరికైతే అప్పులిచ్చి మరీ కొనిపించాడు. ‘ఆరోజు ఆయన పదివేలు ఇవ్వబోతే, మొహమాటం కొద్దీ ఐదువేలే తీసుకున్నా. అదీ తీసుకుని ఉంటే, నా సంపద రెట్టింపు అయ్యేది’ అని చెబుతాడో సీనియర్‌ ఉద్యోగి. ఏదైనా కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసినప్పుడు...ఆ బాధ్యతల్ని సంస్థలోని సమర్థుల్లోనే, ఎవరో ఒకరికి అప్పగిస్తాడాయన. అదనపు నైపుణ్యం అవసరమనుకుంటే, సహాయకులుగా బయటి వ్యక్తుల్ని నియమిస్తాడు. ‘అనగనగా ఓ పులి, ఓ జింక. రెండూ పొద్దున్నే పరుగు ప్రారంభించాయి. పందెం ఏమిటంటే...పులి గెలిచిందంటే జింకను తినేయవచ్చు. జింక గెలిచిందంటే మాత్రం, పులి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి, సదరు జింకతో సహా ఏ జంతువునూ తినకూడదు.ఈ కథలో అంతర్లీన నీతి ఏమిటో తెలుసా...జీవితమూ పరుగు లాంటిదే. ప్రతి పరిణామమూ మన ఉనికిని నిర్ణయిస్తుంది’ అని చెబుతుంటాడు. నైపుణ్యంతో, శ్రమతో ఉనికిని చాటుకుంటున్న ఉద్యోగుల్ని ఉదయ్‌ కళ్లు గమనిస్తూనే ఉంటాయి, ప్రోత్సహిస్తూనే ఉంటాయి.


పాలనా దక్షుడైన బాస్‌ అద్దాల గదికే పరిమితం కావాలనుకోడు. సిబ్బంది మధ్యే ఉండాలనుకుంటాడు. సమర్థులైన బాసుల్లో అధికశాతం మంది...ఓపెన్‌ ఆఫీస్‌ విధానం వైపే మొగ్గుచూపుతారు. బాస్‌ - ఉద్యోగి మధ్య దూరం అరవై అడుగులు ఉన్నప్పటి కంటే, ఆరు అడుగులు ఉన్నప్పుడే ‘కమ్యూనికేషన్‌’ నాలుగురెట్లు అధికంగా ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ పాలసీ రిసెర్చ్‌ ప్రకారం...విజయవంతంగా నడుస్తున్న కంపెనీల పెద్ద బాసులు 15 శాతం సమయాన్ని ఫోన్‌కాల్స్‌కూ మెయిల్స్‌కూ ఏకాంత అధ్యయనాలకూ కేటాయిస్తారు. మిగతా 85శాతం సమయం... ఉద్యోగులూ లేదా క్లైంట్ల మధ్యే గడుపుతారు.

బరువు మోపేవాడు కాదు, పంచుకునేవాడే అసలైన బాస్‌. గూగుల్‌ ఇండియా అధినేత రాజన్‌ ఆనందన్‌కు, లక్ష్యాల పేరుతో సిబ్బందిని తీవ్ర ఒత్తిడికి గురిచేయడం ఇష్టం ఉండదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎన్నోకొన్ని పొరపాట్లూ, ఒకట్రెండు వైఫల్యాలూ తప్పకపోవచ్చు. అలాంటి సమయాల్లో ... అమాయక ఉద్యోగిని శిలువ ఎక్కించకుండా, బాసు కూడా ఆ భారాన్ని మోయాలంటాడు. ‘ఎవరెస్టు ఎక్కాలి కానీ, ఆక్సిజన్‌ మాత్రం ఇవ్వను..అంటే ఎలా కుదుర్తుంది’ అంటూ ఉద్యోగుల పక్షం వహిస్తాడు. అసమర్థుడైన బాసు ఆత్మన్యూనతను సృష్టిస్తే, సమర్థుడైన బాసు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాడు.

ఉద్యోగిని నిర్ణయాల్లో భాగస్వామిని చేయడం ద్వారా అద్భుతాలు సాధించవచ్చని నిరూపించారు గ్లోబల్‌ టెక్నాలజీ సంస్థ క్యాప్‌ జెమినీ భారతీయ విభాగం సీయీవో అరుణా జయంతి. చాలా సందర్భాల్లో ఆమె, కొత్త ఆలోచనల్ని స్వాగతించడానికి క్రౌడ్‌సోర్సింగ్‌ పద్ధతిని అనుసరిస్తారు. ‘ఫలానా విషయంలో మీ ఆలోచనలు చెప్పండి’ అంటూ ఉద్యోగులందరికీ మెయిల్స్‌ వెళ్తాయి. ‘నలభైవేలమందిలోంచి నాలుగువేలమందే స్పందించవచ్చు. ఆ నాలుగువేలమందిలో ఒకరో ఇద్దరో కంపెనీకి పనికొచ్చే ఆలోచనలు ఇవ్వవచ్చు. ఆ ఒక్క ఐడియా కోసమైనా సరే, నలభైవేలమందినీ భాగస్వాముల్ని చేస్తాను’ అంటారు జయంతి. అసలు సిసలు బాస్‌కు ... యంత్రాల సామర్థ్యం మదింపులోనో, కంపెనీ బ్రాండ్‌ విలువ లెక్కింపులోనో, మార్కెట్‌ హెచ్చుతగ్గుల అంచనా మీదో - ఎంత పట్టు ఉంటుందో, అంతకు వందరెట్ల అవగాహన మానవ వనరుల మీదా ఉంటుంది.

విలువల యాత్ర.... 
ప్రతి సంస్థకూ ఓ వ్యాపార ప్రణాళిక ఉంటుంది. అది కనుక కుటుంబ వ్యాపారమైతే, కుటుంబ రాజ్యాంగమూ ఉంటుంది. కానీ, పిరమల్‌ పరివారానికి సంబంధించినంత వరకూ ప్రణాళిక అయినా రాజ్యాంగమైనా భగవద్గీతే! కర్మయోగం, ధర్మకర్తృత్వం, నిష్కామకర్మ - తదితర పదజాలం సంస్థ సమావేశాల్లో ప్రతిధ్వనిస్తుంది. వ్యాపారం చేయడం కష్టమైన విషయమే. విలువలకు కట్టుబడి ఉండటం మరింత కష్టమైన విషయం. విలువలతో కూడిన వ్యాపారం చేయడం - అజయ్‌ పిరమల్‌ లాంటి ఏ కొద్దిమందికో కానీ సాధ్యం కాదు. అతను వ్యాపార కురుక్షేత్రంలో అర్జునుడు. మంచిచెడుల విషయంలో, న్యాయాన్యాయాల విషయంలో, ధర్మాధర్మాల విషయంలో ఏ సందేహం వచ్చినా పరిష్కారం కోసం కృష్ణభగవానుడివైపు...భగవద్గీతవైపు చూస్తాడు. ఆయన కార్యాలయం గోడల నిండా గీతోపదేశ చిత్రాలే కనిపిస్తాయి. కాన్ఫరెన్స్‌ గదులకు కూడా...ధనంజయ, పార్థ, కపిధ్వజ తదితర అర్జున నామాలే! ఆ భవంతుల్నీ బ్యాంకు నిల్వల్నీ తన సొంతంగా ఎప్పుడూ భావించడాయన. ‘కంపెనీ వాటాదారుల సంపదకు నేను ట్రస్టీని మాత్రమే’ అంటాడు. తొలి సమావేశంలోనే తమ సంస్థ గురించీ విలువల గురించీ క్లైంట్లకు స్పష్టంగా చెప్పడం పిరమల్‌ పద్ధతి. దీనివల్ల, ఆ విలువలకు కట్టుబడి ఉండేవారే దీర్ఘకాలిక అనుబంధాన్ని కొనసాగిస్తారు. లేదంటే తమదారి తాము చూసుకుంటారు. మారికో ఛైర్మన్‌ మారివాలాదీ అదే మాట, అదే బాట. మారికోలో ఉద్యోగుల హాజరీని ఎవరూ లెక్కబెట్టరు. సెలవుల ఖాతా కూడా తయారు చేయరు. ఎవరికివారు రాసిపెట్టుకుంటారు. ఆ లెక్కల ప్రకారమే జీతభత్యాలు! విలువలనేవి పైనుంచి కిందికి ప్రవహించాలి. బాస్‌ ధర్మానికి కట్టుబడి వ్యవహరిస్తే, సిబ్బంది కూడా విలువలకు విలువనిస్తారు.


బాసు..మనసు!
ముదురు రంగు డ్రస్సు వేసుకునే వారిలో వృత్తి మీద ఎక్కువ ‘ఫోకస్‌’ ఉంటుందని వర్ణనిపుణుల అంచనా. ‘బాస్‌ డే, ‘న్యూ ఇయర్‌’ తదితర ప్రత్యేక సందర్భాల్లో నీలం, ఎరుపు తదితర ముదురు రంగుల్లోనే వెళ్లి బాస్‌కు శుభాకాంక్షలు చెప్పండి. 


అందరూ తేలిగ్గా తీసేసుకుని, దాదాపుగా మరచిపోయిన లక్ష్యాల్ని... బుద్ధిగా సకాలంలో పూర్తిచేసి చేతిలోపెట్టే ఉద్యోగులంటే బాసులకు ప్రత్యేక అభిమానం. 
బాసూ పరిపూర్ణుడు కాదు. తనకు, ఏమాత్రం ఆసక్తిలేని విషయం మీదా ఎలాంటి అవగాహనాలేని రంగం మీదా పట్టు సాధించండి. సదరు విషయాల మీద ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బాసు మిమ్మల్నే సలహా అడుగుతాడు. 

లస్యంగా విధులకు రావడాన్ని బాసులు సహించలేరు. సమయానికి వచ్చేవాళ్ల మీద ఎంతోకొంత సదభిప్రాయం ఉంటుంది. ముందే వచ్చి, ఆలస్యంగా వెళ్లేవారంటే మాత్రం చాలాఅభిమానం చూపుతారు. 

డియా జీవుల్ని బాసులు తెగ ప్రేమిస్తారు. మీ ఐడియా గొప్పగా ఉండవచ్చూ ఉండకపోవచ్చు. కానీ, సంస్థ గురించి ఎంతోకొంత ఆలోచిస్తున్నారు కదా! అది చాలు. చక్కని ‘హోమ్‌వర్క్‌’తో సమావేశాలకు వచ్చేవారన్నా బాసుకు అంతే అభిమానం. 

అచ్చమైన మనిషి... 

పదవుల భుజకీర్తులూ, కార్పొరేట్‌ కిరీటాలూ...ఎన్నయినా ఉండవచ్చు. అంతర్లీనంగా బాసు మనిషే, అచ్చమైన మనిషే, ఆనంద్‌ మహీంద్రాలా! ఓ కార్పొరేట్‌ నిపుణుడు నియామక ఇంటర్వ్యూలో భాగంగా...ఆనంద్‌ను కలవడానికొచ్చాడు. చాలాసేపు మాట్లాడుకున్నారు. కలసి భోంచేశారు. ఆ గంటలోనే అతను ఆనంద్‌ వీరాభిమానిగా మారిపోయాడు. ‘నేను కార్పొరేట్‌ రంగంలో ఉన్నంత కాలం ఇక్కడే పనిచేయాలని నిర్ణయించుకున్నా. ఎవరైనా కంపెనీని ఎంచుకుంటారు. నేను మాత్రం యజమానిని ఎంచుకున్నా...ఇక నుంచి ఆనంద్‌ నా బాస్‌’- అని ప్రకటించేశాడా వ్యక్తి. ఎదుటి మనిషిని అయస్కాంతంలా ఆకర్షించే గుణం ఆనంద్‌ ప్రత్యేకత. ఆయన మాటల్లోకానీ చేతల్లో కానీ ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. ముసుగులూ గట్రా ఉండవు. తొలి పరిచయంలోనే ఎదుటివారిని పేరుతో పిలిచే చొరవ తీసుకుంటాడు, తననూ అలానే పిలవమని ప్రోత్సహిస్తాడు. ఓ మహీంద్రా ఉద్యోగికి పోటీ సంస్థ నుంచి ఆఫర్‌ లెటర్‌ వచ్చింది. జీతం చాలా ఎక్కువ. అయినా అతను చేరలేదు. ‘అయితే, నువ్వు మేనేజ్‌మెంట్‌ మనిషివన్నమాట!’ వేళాకోళం ఆడాడో సహోద్యోగి. ‘కాదు, మహీంద్రాలో నేనే ఓ మేనేజ్‌మెంట్‌’ తాపీగా జవాబిచ్చాడు. ఆనంద్‌ ఉద్యోగుల్ని ‘ఎంపవర్‌’ చేసే విధానం అంత బలంగా ఉంటుంది. ఓరోజు తెల్లవారుజామున ఆనంద్‌కు ఓ సీనియర్‌ ఉద్యోగి నుంచి మెయిల్‌ వచ్చింది, ఏదో సలహా కోసం. మరు నిమిషమే...‘ఈరోజు ఆదివారం. సోమవారం నుంచి శుక్రవారం దాకా మాత్రమే నువ్వు కంపెనీ కోసం పనిచేయాలి. మిగతా రెండు రోజులూ నీ వ్యక్తిగత సమయం. ఆ చొరబాటు నాకిష్టం లేదు’ అని సమాధానం ఇచ్చాడు ఆనంద్‌. ఆ చివాట్లు బాసుగా కాదు, తోటి మనిషి హోదాలో! 


దీర్ఘదృష్టి... 

బాస్‌ ... నేటి పరిణామాల్ని నిన్ననే వూహించాలి. రేపటి పరిస్థితుల్ని ఈరోజే అంచనా వేయాలి. తండ్రి మరణంతో స్టాన్‌ఫర్డ్‌ నుంచి వెనక్కి వచ్చేసి వ్యాపార బాధ్యతలు స్వీకరించారు అజిమ్‌ ప్రేమ్‌జీ. అప్పటికి, విప్రో సంస్థ వనస్పతి వ్యాపారం మాత్రమే చేస్తోంది. ఆ ఒక్క వ్యాపారంతో ఏ ప్రగతీ సాధించలేమని ఆయనకు అర్థమైపోయింది. సబ్బులూ సౌందర్య సాధనాల రంగంలోకి వచ్చారు. నాలుగు దశాబ్దాల ముందే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ భవిష్యత్తును వూహించి, విప్రో టెక్నాలజీస్‌ను స్థాపించారు. ఐసీఐసీఐ బ్యాంకును అగ్రగామిగా తీర్చిదిద్దడంలో చందాకొచ్చర్‌ దార్శనికతా తక్కువేం కాదు. డిజిటల్‌-సోషల్‌-మొబైల్‌ ... ఇదే ఆమె త్రిముఖ వ్యూహం. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ కాలక్షేపానికే పరిమితం కావాలా? బ్యాంకింగ్‌ లావాదేవీల్నీ ఎందుకు నిర్వహించుకోకూడదు? - అన్న ఆలోచనతో భారతీయ బ్యాంకింగ్‌ స్వరూపాన్నే మార్చారామె. ఫేస్‌బుక్‌ బ్యాంకింగ్‌కు శ్రీకారం చుట్టారు. ట్విటర్‌ ద్వారా లావాదేవీలు జరుపుకొనే అవకాశం కల్పించిన తొలి భారతీయ సీయీవో ఆమే! ప్రేమ్‌జీ అయినా, కొచ్చర్‌ అయినా... ఇదంతా బృంద విజయమే అని చెబుతారు. బాస్‌లో ఉండాల్సిన తొలి లక్షణం... గెలుపులో భాగం ఇవ్వడం, ఓటమిలో వాటా తీసుకోవడం!


బాస్‌...ఆదర్శ నాయకుడు కావాలి! చెప్పిందే ఆచరించాలి, ఆచరించిందే చెప్పాలి. అప్పుడే, సిబ్బందిలో గౌరవం ఇనుమడిస్తుంది. ప్రోత్సాహకాలతో పెంచే ఉత్సాహం, మెమోలతో చేసే బెదిరింపులూ ఎంతోకాలం పనిచేయవు. నియంత్రణ ద్వారా సాధించలేనిది స్ఫూర్తి ద్వారా సాధ్యం అవుతుంది. గోద్రెజ్‌ కార్యాలయాల్లో సమయానికి ఐదు నిమిషాల ముందే సిబ్బంది సీట్లలో ఉంటారు. అలా అని, సమయపాలనకు సంబంధించి ఎప్పుడూ కఠినమైన ఉత్తర్వులు జారీ అయిన దాఖలాలూ లేవు. పెద్దబాస్‌ ఆదిగోద్రెజ్‌ అందించిన స్ఫూర్తే ఇదంతా. తొలిరోజుల నాటి సంగతి ఇది. వ్యాపార విస్తరణ కోసం ఆది విదేశాలకు వెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా సమావేశాలున్నాయి. ఓ సమావేశంలో పాల్గొనడానికి, కాస్త దూరంగా ఉన్న మరో ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. సమయానికి కారు రాలేదు. ఏం చేయాలో తోచలేదు ఆది వ్యక్తిగత కార్యదర్శికి.‘నీకు పరుగెత్తడం అలవాటేనా?’ - అంత ఒత్తిడిలోనూ నవ్వుతూ అడిగారు ఆది. ‘ఫర్వాలేదు సర్‌! కాలేజీ రోజుల్లో బహుమతులు కూడా వచ్చాయి’- ఈ సమయంలో ఇలాంటి ప్రశ్న ఎందుకో అర్థం కాకపోయినా, అడిగింది బాసు కాబట్టి వినయంగా జవాబిచ్చాడా యువకుడు.
‘అయితే పరుగెత్తు...’ ఫుట్‌పాత్‌ మీద పరుగు మొదలుపెట్టారు ఆది గోద్రెజ్‌. పదంటే

పది నిమిషాల్లోనే గమ్యానికి చేరుకున్నారు. అదీ సమయపాలన అంటే. పాలనలో సమయపాలనా భాగమే. సమర్థుడైన బాస్‌ కంటే, గడియారం ముల్లు ఎప్పుడూ ఓ సెకెను ఆలస్యమే!
                                                                          (ఈనాడు వారి సౌజన్యంతో )

Comments