ఇతర రాష్ట్రాల, దేశాల ముఖ్యపట్టణాల అనుభవాల నుంచి
పాఠాలు
వాటన్నిటికంటే మిన్నగా నిర్మించాలని సంకల్పం
ఏపీ రాజధాని అమరావతి 21వ శతాబ్దంలో అందరి
దృష్టినీ ఆకర్షించనుంది. వందేళ్ల ముందుచూపుతో, పకడ్బందీ వ్యూహాలతో అంతర్జాతీయ స్థాయి
రాజధాని నగరాన్ని నిర్మించాలని ప్రభుత్వం గట్టి సంకల్పంతో ఉంది. ఇందుకోసం ఇప్పటికే
దేశవిదేశాల్లోని పలు నగరాల ప్రణాళికలను పరిశీలించారు. వాటిలోని మంచిచెడులు.. లాభనష్టాలను
బేరీజు వేశారు. మరోవైపు చిన్న దేశాలైన కజకిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్ రాజధానుల్లో
పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ.. సోవియట్ యూనియన్ నుంచి వేరుపడిన ఆయా దేశాలు సాధించిన
అభివృద్ధి, పట్టణ ప్రణాళికలు ఆకట్టుకోవడంతో వాటినీ పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు
సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆధునిక నిర్మాణ మెలకువలు, అందుబాటులోని వనరుల
ఆలంబన, మౌలిక సదుపాయాల కల్పన, పాలన సౌలభ్యం, వికేంద్రీకరణ వంటి అన్ని అంశాలనూ పరిగణనలోకి
తీసుకుని రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సాగుతోంది. ఇందుకోసం సమకాలీన
భారతంలో నిర్మితమైన నగరాలు, రాజధానులు ఎదుర్కొన్న ఇబ్బందులు.. వాటిని పరిష్కరించుకున్న
తీరు అధ్యయనం చేసి అక్కడ ఏర్పడిన సమస్యలు ఇక్కడ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తొంది.
పాలన, వాణిజ్యం, పారిశ్రామికం, ఉపాధికల్పన నీటివసతి, మురుగునీటి పారుదల, పారిశుద్ధ్య
నిర్వహణ, సమాచార సాంకేతిక వ్యవస్థల్లో ముందడుగు, పర్యాటకం, పచ్చదనం, వినోదం.. ఇలా మానవాళి
సులభ, సౌఖ్య, సుస్థిర జీవనానికి కావాల్సిన ప్రతి అంశాన్నీ ప్రాధాన్యంగా తీసుకుని ప్రజా
రాజధానికి పునాదులు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రధాని సూచించిన రాజధానులు, ప్రణాళికపరంగా
పేరెన్నికగన్న నగరాలు, దేశంలోని కొత్త రాజధానులు, సౌకర్యవంతమైన పట్టణాలు అన్నిటిలోని
మంచిచెడులను జల్లెడపట్టి అమరావతిని ప్రపంచంలోనే మేటి నగరంగా నిలిపేందుకు సమాయత్తమవుతున్నారు.
కొత్త రాష్ట్రాల ఎత్తుపల్లాలు
ఎన్డీఏ ప్రభుత్వం 2000లో దేశంలో మూడు కొత్త రాష్ట్రాలు ఉత్తరాఖండ్,
ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లను ఏర్పాటుచేసింది. పదిహేనేళ్ల కిందట అవతరించిన ఆ రాష్ట్రాలకు
నేటికీ చెప్పుకోదగిన స్థాయిలో రాజధానులు అభివృద్ధి కాలేదు.
డెహ్రాడూన్
గ్రామీణ నేపథ్యమున్న ఉత్తరాఖండ్‌కు రాజధాని డెహ్రాడూన్. గంగ, యమునా
నదుల మధ్య ఎతై్తన కొండలపై ఉన్న ఈ నగరం ఇప్పటికీ అభివృద్ధి చెందలేదు. కొండల మధ్య రాజధాని
ఏర్పాటుచేయడంతో అక్కడికి చేరుకునేందుకు నేటికీ సరైన రోడ్డు మార్గాలు లేవు. రాజధానిలో
అభివృద్ధి పనులు చేయాల్సి ఉన్నా విస్తరణకు మైదాన ప్రాంతం అందుబాటులో లేదు.
* అమరావతి కూడా నదీతీరంలోనే నిర్మితమవుతోంది.
నగర విస్తరణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, మౌలికవసతుల సమస్య తలెత్తకుండా ముందుచూపుతో తగినంత
భూమిని రైతుల ఆమోదంతో సమీకరించారు.
రాంచీ
బిహార్ నుంచి వేరైన ఝార్ఖండ్‌కు రాంచీ రాజధాని. ఇదో చిన్న నగరపాలక
సంస్థ. జలపాతాల నగరంగా పేరున్న రాంచీకి సమీపంలో నూతన రాజధాని నిర్మించేందుకు 2008లో
మహా రాంచీ అభివృద్ధి ప్రాధికారసంస్థను నెలకొల్పారు. రాజధానిని కేవలం ప్రభుత్వ కార్యాలయాల
కేంద్రంగా కాకుండా వాణిజ్య స్థావరంగా మార్చాలని ప్రణాళిక రచించారు. నూతన రాజధాని ప్రాంతాన్ని
30 వేల హెక్టార్లలో, మూడు దశల్లో నిర్మించాలనుకున్నారు. సరైన భూసేకరణ విధానం అమలు చేయకపోవడంతో
నిత్య వివాదాలతో పనులు ప్రారంభ దశ దాటలేదు.
నయా రాయ్‌పూర్
ఛత్తీస్‌గఢ్ తాత్కాలిక పరిపాలన రాజధానిగా రాయ్‌పూర్‌ను ప్రకటించారు.
2008లో రాయ్‌పూర్‌కు 17 కి.మీ. దూరంలో నూతన రాజధాని నయారాయ్‌పూర్ నిర్మాణానికి ప్రణాళిక
రూపొందించారు. నేటికీ పూర్తిస్థాయి మౌలికసదుపాయాలు ఏర్పడలేదు. దీంతో ప్రజలు ఉదయాన్నే
నయారాయ్‌పూర్ వచ్చి పనులు ముగించుకుని సాయంత్రానికి రాయ్‌పూర్ వెళ్లిపోతున్నారు.
* నయారాయ్‌పూర్ నిర్మాణానికి
భూసమీకరణ అమలు చేశారు. ఏపీ ప్రభుత్వం మాదిరి అక్కడా రైతులకు నివాస, వాణిజ్య స్థలాన్ని
ఇచ్చారు. దీంతో పెద్దగా భూసేకరణ, సమీకరణ ఇబ్బందులు రాలేదు.
చండీగఢ్
హరియాణా, పంజాబ్‌లకు ఇది రాజధాని. స్వతంత్ర
భారతదేశంలో మొట్టమొదటి ప్రణాళికాబద్ధ నగరంగా చండీగఢ్ ప్రసిద్ధికెక్కింది. దీని పట్టణ
ప్రణాళిక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అమెరికాకు చెందిన అల్బర్ట్‌మేయర్ రూపొందించిన
ప్రణాళిక ఆధారంగా లీ కార్బూజియర్ చండీగఢ్ బృహత్ ప్రణాళిక రూపొందించారు. ఇక్కడి ప్రభుత్వ
కార్యాలయాలు, నివాససముదాయలకు చండీగఢ్ రాజధాని పథక బృందం రూపకల్పన చేసింది.
ఎన్నో పరిశీలనలు..
మరెన్నో అధ్యయనాలు
రాజధాని ప్రణాళిక రూపొందించిన సింగపూర్ కూడా ప్రపంచంలోని పలు దేశాల
రాజధానులను అధ్యయనం చేసింది. నదీముంగా, హరిత ప్రధానంగా ఉన్న వివిధ నగరాలను పరిశీలించింది.
వాటిలో కొన్నిటిని తన బృహత్ ప్రణాళికలోనూ ఉటంకించింది. అత్యంత ప్రణాళికాబద్ధమైన నగరంగా
పేరొందిన వాషింగ్టన్ డీసీ (అమెరికా)ను పరిశీలించింది. ఆధునిక నిర్మాణశైలితో ఆకట్టుకునే
బ్రెజీలియా (బ్రెజిల్), ఆస్ట్రేలియాలో పక్కా ప్రణాళికతో నిర్మించిన కాన్‌బెర్రాలను
అధ్యయనం చేసింది. 38 శాతం భూభాగం పచ్చదనానికే కేటాయించి, పూర్తిగా స్వదేశీ ప్రమేయంతో
1995లో నిర్మించిన పుత్రజయ (మలేసియా) నగర నిర్మాణంలో అనుసరించిన పద్ధతులనూ పరిశీలించింది.
మోదీ సూచించిన
నమూనాలివి...
అస్తానా(కజకిస్తాన్)
సోవియట్ యూనియన్ నుంచి వేరయ్యాక 1997లో కజకిస్తాన్ తమ రాజధానిని
అల్మాటి నుంచి ఇషోం నదీ తీరంలోని ఆస్తానా (అక్మోలా)కు మార్చింది. తొలివిడత ఐదేళ్ల ప్రణాళిక
కింద విమానాశ్రయం, గృహనిర్మాణం, రవాణ వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
నగర కేంద్రం అభివృద్ధికి, మార్పునకు చిహ్నంగా ఉండేలా ప్రణాళిక వేసింది. వ్యాపార కేంద్రం,
ప్రభుత్వ పరిపాలన భవనాల సముదాయం, ఐటీ, ఇతర వాణిజ్య కేంద్రాలు, కార్యాలయాల భవనాలకు చోటు
కల్పించారు. నగరానికి చుట్టూ బాహ్యవలయ రహదారులు, విశాలమైన అంతర్గత రహదారులు, ప్రజా
రవాణా వ్యవస్థ, పచ్చదనం, సుందరీకరణ, క్రీడామైదానాలు, ఆకాశహర్మ్యాల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చారు.
అష్కబాట్ (తుర్క్‌మెనిస్థాన్)
తుర్క్‌మెనిస్థాన్‌కు ఓవైపు కరకుం ఎడారి, మరోవైపు కోపెట్‌డాగ్
పర్వతాలున్నాయి. రాజధాని అష్కబాట్‌లో కరకుం కాలువ ప్రవహిస్తోంది. 1948లో పెను భూకంపం
రావడంతో నగరం పూర్తిగా నాశనమైంది. పునర్నిర్మాణంలో అష్కబాట్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
ఆధునిక పద్ధతులు, సంప్రదాయాలను మేళవిస్తూ భవనాలు నిర్మించారు. 12 అంతస్తుల భవనాలకు
అనుమతులు ఇవ్వడంతో వేగంగా అభివృద్ధి చెందింది.
రైతును మెప్పించి... భూసమీకరణ
ఎక్కడ ఏ ప్రాజెక్టు చేపట్టినా భూసేకరణ రణరంగమే. రైతుల నుంచి బలవంతంగా
భూములను సేకరించడం, రైతులు తిరగబడటం, న్యాయ వివాదాలతో ముడిపడినవే. బలవంతపు భూసేకరణతో
రైతులు సర్వస్వం కోల్పోయి రోడ్డున పడిన సందర్భాలు ఎన్నో.. భూములిచ్చిన రైతులు ఆయా భూముల్లో
వెలిసిన సంస్థల్లో కూలీలుగా, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ కనిపిస్తారు. మరోవైపు
భూసేకరణపై గత ఏడాదిన్నరగా పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.
ఇంతటి క్లిష్టమైన భూసేకరణ సమస్యను చంద్రబాబునాయుడు సులభంగా పరిష్కరించారు. ఎక్కడా గొడవలు
లేవు.. రైతుల తిరుగుబాటు లేదు. ఏపీ నూతన రాజధాని కోసం రైతులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి
33వేల ఎకరాల సారవంతమైన భూములను ముఖ్యమంత్రిపై నమ్మకంతో ఇచ్చారు. రక్తపాతం, ఆందోళనలు
లేకుండా జరిగిన ఏపీ భూసమీకరణ ఇతర రాష్ట్రాలకే కాదు ప్రపంచ దేశాలకు ఆదర్శమైంది. భూములు
కోల్పోయిన రైతులకు మెరుగైన పరిహారం, ఆయా భూముల్లో పనిచేస్తున్న కూలీలకు నెలవారీ పింఛన్లు,
యువతకు నైపుణ్య శిక్షణ, ఇలా ఎన్నో ప్రతిఫలాలు అందాయి. చివరకు భూసమీకరణలో భూములిచ్చిన
రైతులు, స్వచ్ఛందంగా మరిన్ని విరాళాలు సేకరించి రాజధాని కోసం ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు,
అసైన్డ్ భూములున్న రైతులందరినీ అభివృద్ధి ఆలోచనతో చంద్రబాబు మెప్పించారు. వారందరినీ
కోటీశ్వరులను చేశారు.
దేశంలో జరిగిన
భూముల సమీకరణలు ఇలా..
చండీగఢ్(పంజాబ్), రాయ్‌పూర్(చత్తీస్‌గఢ్), గాంధీనగర్(గుజరాత్)ల్లో
రాజధానుల కోసం భూమి తీసుకునేందుకు ఆయా ప్రభుత్వాలు అవలంభించిన విధానాలను ఏపీ సర్కారు
పరిశీలించింది. రైతును మెప్పించేలా భూసమీకరణ ఉండాలని నిర్ణయించింది.
* ఝార్ఖండ్ రాజధాని రాంచీ నిర్మాణానికి
ప్రధాన అడ్డంకి భూసేకరణ. అక్కడి రైతులకు పరిహారం నచ్చక రాజధాని నిర్మాణం ఏడేళ్లుగా
ముందుకు కదలడంలేదు. నిత్య ఆందోళనలతో రణరంగంలా ఉంది.
* గుజరాత్ పట్టణ ప్రణాళిక పథకం
సమీకరణ విధానంలో ముందడుగు. భారీగా భూములను సమీకరించి, వాటిని అభివృద్ధి చేసి రైతులు,
ఆయా భూముల యజమానులకు వాటా ఇచ్చారు. తద్వారా భూములకు మంచి విలువ వచ్చేలా చేశారు. సూరత్‌లో
అవుటర్ రింగు రోడ్డును ఇదే విధానంలో నిర్మించారు.
* దిల్లీ అభివృద్ధి అథారిటీ సమీకరణ
విధానంలో రైతులందరికీ సమాన వాటా లభించలేదు. అన్ని మౌలిక సదుపాయాలకు తీసివేయగా మిగిలిన
స్థలాన్ని అభివృద్ధి చేసి అందులో రైతులకు తక్కువ వాటా ఇచ్చారు.
* గ్రేటర్ మొహలీ అభివృద్ధి అథారిటీ(జీఎండీఏ)
రూపొందించిన విధానాన్ని ఏపీ సర్కారు పరిగణనలోకి తీసుకుంది. తక్కువ విస్తీర్ణంలో స్థలాలు
కోల్పోయిన రైతులకు మెరుగైన పరిష్కారం చూపించింది. భూమి కోల్పోయిన రైతుకు నివాస స్థలంతో
పాటు వాణిజ్య స్థలాన్ని ఇచ్చే ప్రతిపాదన చేర్చింది. రైతుకు వాటాకు బదులు నగదు కావాలనుకున్న
వారికీ ఆ మేరకు చెల్లింపులు చేసింది. 10 సెంట్లున్న రైతుకు మెరుగైన పరిహారం ఇచ్చింది.
రైతుకు రావాల్సిన వాటా అభివృద్ధి చేసేంత వరకు ఏటా పరిహారం ప్రతిపాదన చేర్చింది.
* ఛత్తీస్‌గఢ్ రాజధాని నయారాయపూర్
కోసం అక్కడి సర్కారు ముందస్తుగా రైతుల అభిప్రాయాన్ని తీసుకుంది. కొందరు రైతులు సర్కారు
ఇచ్చే ప్యాకేజీకి ఒప్పుకోలేదు. దీంతో అక్కడ భూసేకరణ, భూసమీకరణ విధానాలను అమలు చేశారు.
కేంద్రంపై గురుతర
బాధ్యత
రాజధాని నిర్మాణంలో
అన్నివిధాల సహకరించాలి
విదేశీ సాయానికీ
అనుమతివ్వాలి
రాష్ట్ర విభజనతో రాజధాని కూడా లేకుండా నిలబడిన నవ్యాంధ్రకు.. రాజధాని
నిర్మించడంలో కేంద్రం ప్రభుత్వంపై గురుతర బాధ్యత ఉంది. విభజన చట్టంలోని సెక్షన్
94(3) ప్రకారం కేంద్ర ప్రభుత్వం నూతన రాజధాని ప్రాంతంలో అత్యవసర సౌకర్యాల కోసం ప్రత్యేక
ఆర్థిక మద్దతు ఇవ్వాలి. ముఖ్యంగా రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలితోపాటు
ఇతర ముఖ్యమైన మౌలిక వసతుల కోసం నిధులు సమకూర్చాల్సి ఉంది. 94(4) సెక్షన్ కింద రాజధానికి
అవసరమైన భూమి కోసం డీగ్రేడెడ్ అటవీ భూమిని డీనోటిఫై చేయాల్సి ఉంది. చట్టంలో చెప్పిన
ప్రభుత్వ భవనాలు, ప్రధాన, అంతర్గత రహదారులు, నీటిసరఫరా, మురుగునీరు, వృథానీటి శుద్ధి,
వరదనీటి ప్రవాహ వ్యవస్థ, ఘనవ్యర్థాల నిర్వహణ వంటి అత్యవసర మౌలిక వసతుల నిర్మాణం కోసం
గరిష్ఠంగా రూ.22,716 కోట్లు కావచ్చని శివరామకృష్ణన్ కమిటీ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం రూ.52,460 కోట్లవుతుందని లెక్కగట్టింది.
* కేంద్రం ఇప్పటివరకూ రూ.1,500 కోట్లు ఇచ్చింది.
ఇందులో రూ.వెయ్యి కోట్లు గుంటూరు, విజయవాడ నగరాల్లో మౌలిక
వసతుల అభివృద్ధికి, రూ.500 కోట్లు రాజధాని నిర్మాణం కోసం అని సూచించింది.
* సెప్టెంబర్ 25న మరో రూ.350 కోట్లు
ప్రకటించింది. ఈ మొత్తం రావాల్సి ఉంది.
* రాజధాని ప్రాంతంలో 50 వేల ఎకరాల
అటవీభూమిని డీనోటిఫై చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర పర్యావరణ, అటవీశాఖలకు ప్రతిపాదనలు
పంపింది. దీనికి దిల్లీ నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు రావాల్సి ఉంది.
విదేశీ సాయానికీ కీలకమే..
రాజధాని నిర్మాణంలో పాలుపంచుకోవడానికి వచ్చే విదేశీ ప్రభుత్వాలు,
సంస్థలకు ఇబ్బందులు లేకుండా అనుమతులు ఇవ్వడంలోనూ కేంద్రానిదే కీలక భూమిక. విదేశీ ప్రత్యక్ష
పెట్టుబడులను అనుమతించడాకి, విదేశీ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు సేకరించడానికి అడ్డంకులు
లేకుండా చేయడంలోనూ కేంద్ర సహకారం తప్పనిసరి. రాష్ట్రానికి వనరులు తక్కువ, ఖర్చులు ఎక్కువగా
ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుల తెచ్చుకొని ఆస్తులు కూడగట్టి, తద్వారా సంపద సృష్టించాలని
ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నారు. ఇందుకోసం రాష్ట్ర రుణపరిమితిని పెంచేలా ఎఫ్‌ఆర్‌బీఎం
చట్టంలో వెసులుబాటు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతోంది. కేంద్రం ఈ మేరకు
అనుమతివ్వాలి. ఈ ప్రాంతంలో రవాణా మార్గాల అభివృద్ధిలోనూ క్రియాశీలకంగా వ్యవహరించాలి.
(ఈనాడు వారి సౌజన్యంతో)
Comments
Post a Comment