న్యూఢిల్లీ : భారత్‌లో జర్మనీ పెట్టుబడులకు సత్వర అనుమతులు మంజూరు చేసేందుకు ఉభయ దేశాల మధ్య అంగీకారం కుదిరింది. అలాగే భారత్‌లో సౌరవిద్యుత్‌రంగం అభివృద్ధి కోసం 100 కోట్ల యూరోల (6900 కోట్ల రూపాయలు) ఆర్థిక సహాయం అందించేందుకు జర్మనీ అంగీకరించింది. ప్రస్తుతం గ్రీన్ కారిడార్‌కు అందిస్తున్న 100 కోట్ల యూరోల ఆర్థిక సహాయానికి ఇది అదనం. భారత్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ ప్రధాని నరేంద్రమోదీతో విస్తృత స్థాయి చర్చల అనంతరం ఉభయులు జారీ చేసిన సంయుక్త ప్రకటనలో ఈ అంశాలు చోటు చేసుకున్నాయి. ఉభయ దేశాల మధ్య భిన్న రంగాల్లో సహకారంపై 13 ఒప్పందాలు కుదిరాయి. మోదీ, మెర్కెల్ మూడవ అంతర్ ప్రభుత్వ శిఖరాగ్ర స్థాయి సంప్రదింపుల సమావేశానికి అధ్యక్షత వహించడంతో పాటు వేరుగా కూడా మూడు గంటల పాటు భిన్న అంశాలపై చర్చలు జరిపారు. రైల్వే, ఏవియేషన్, రక్షణ, భద్రత, గూఢచర్యం, వాణిజ్యం, స్వచ్ఛ ఇంధనాల విభాగంలో విస్తృతంగా సహకరించుకోవాలని వారు నిర్ణయించారు. భారత రైల్వే ఆధునికీకరణ జర్మనీ కంపెనీలకు వాణిజ్యపరంగా అద్భుతమైన అవకాశాలు అందుబాటులోకి తెస్తుందని వారు అంగీకారానికి వచ్చారు. హైస్పీడ్ రైళ్ళు, స్టేషన్ల పునర్నిర్మాణం, ఆధునిక బోగీల తయారీ, లాజిస్టిక్ టెర్మినల్స్ ఏర్పాటు వంటి విభాగాల్లో సహకారానికి మంచి అవకాశాలున్నట్టు వారు నిర్ణయించారు. రైల్వేల్లో మేనేజర్లు, సూపర్‌వైజర్లు, ఇన్‌స్ట్రక్టర్లకు శిక్షణ కూడా చక్కని భాగస్వామ్యానికి అవకాశం ఉన్న మరో రంగమని వారు అభిప్రాయపడ్డారు. విభిన్న విభాగాల్లో సత్వర భాగస్వామ్యాల ఏర్పాటుకు కృషి చేయాలని ఉభయులు తమ దేశాలకు చెందిన ప్రైవేటు రంగాన్ని కోరారు.
సత్వర అనుమతులకు ప్రత్యేక వ్యవస్థ
దేశంలో వ్యాపార నిర్వహణ సరళం చేయడంతో పాటు పెట్టుబడుల కోసం ముందుకు వస్తున్న జర్మనీ కంపెనీలకు సత్వర అనుమతులు మంజూరు చేసేందుకు పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక శాఖలో (డిఐపిపి) ఫాస్ట్‌ట్రాక్ వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేస్తామని భారత్ ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో పని చేస్తుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీర్ఘకాలంగా నిలిచిపోయిన భారత-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు పునరుద్ధరించేందుకు కూడా ఉభయ దేశాలు అంగీకారానికి వచ్చాయి. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించుకోవాలన్న కట్టుబాటును మరోసారి ప్రకటించాయి. యూరోపియన్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై 2013 మార్చి నుంచి 14 విడతలుగా చర్చలు జరిగాయి. ఈ లోగా జివికె బయోసైన్సెస్‌కు చెందిన 700 వరకు ఫార్మా ఉత్పత్తుల విక్రయాన్ని నిషేధించడంతో అసంతృప్తి ప్రకటిస్తూ భారత్ ఆ చర్చల నుంచి వైదొలగింది. వాస్తవానికి ఈ చర్చలు 2007లోనే ప్రారంభమై దశలవారీగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ చర్చలను పునరుద్ధరించేందుకు కలిసి కృషి చేయాలని ఉభయులు నిర్ణయించారు. అలాగే డిసెంబర్‌లో నైరోబీలో జరుగనున్న డబ్ల్యుటిఒ మంత్రుల స్థాయి సమావేశంలో దోహా చర్చల్లో అనుమతించిన అంశాల పరిధిలో సానుకూల ఫలితాలు సాధించేందుకు ఉమ్మడిగా కృషి చేయాలని కూడా వారు అంగీకారానికి వచ్చారు. అలాగే దోహా రౌండ్ చర్చలను ఒక కొలిక్కి తీసుకురావాలని కూడా అంగీకారానికి వచ్చారు. ఆచరణీయమైన వ్యాపార సహకారానికి అనుకూలమైన కొత్త రంగాలపై పరిశీలించేందుకు 2016 సంవత్సరంలో ఇండో జర్మన్ జాయింట్ కమిషన్ సమావేశం నిర్వహించాలని కూడా ఉభయులు అంగీకరించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇండో జర్మన్ ఎనర్జీ ఫోరమ్ వంటి వేదికల ప్రాధాన్యతను గుర్తిస్తూ అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంలో కూడిన విభాగాల్లో సహకారానికి గల ప్రత్యేక అవకాశాలను గుర్తించే ప్రయత్నం చేసేందుకు కూడా నిర్ణయించారు. ప్రత్యేకించి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద జర్మనీ కంపెనీలకు మరిన్ని పెట్టుబడి అవకాశాలు అందుబాటులో ఉంటాయని కూడా ఉభయులు ఆశాభావం ప్రకటించారు.
(ఆంధ్రజ్యోతి వారి సౌజన్యంతో)
Comments
Post a Comment