- అంతర్జాతీయ అనిశ్చితులను తట్టుకోగలదు
- 2017-18 కల్లా 8 శాతానికి జీడీపీ
- ఎగుమతులు బలహీనంగా ఉన్నా సరే
- ఈ ఏడాది 7.5 శాతం వృద్ధిరేటు సాధిస్తుంది
ప్రపంచ బ్యాంకు అంచనాలు
(వాషింగ్టన్)
అంతర్జాతీయ అనిశ్చితులను సమర్థంగా తట్టుకునే సత్తా భారత్‌కు ఉందని ప్రపంచ బ్యాంకు కితాబునిచ్చింది. సంస్కరణలను వేగవంతంగా అమలు చేయగల అవకాశాలు ఉండడం ఇందుకు కారణంగా చూపింది. ఎగుమతుల్లో వృద్ధి బలహీనంగా ఉన్నప్పటికీ వాస్తవ జీడీపీ వృద్ధి 7.5 శాతంగా నమోదుకాగలదని అంచనా వేసింది. ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా వృద్ధి చెందుతున్న దేశం భారతేనని ‘సౌత్ ఏషియా ఎకనామిక్ ఫోకస్ ఫాల్ 2015’ నివేదికలో వెల్లడించింది. ఇంకా ఆ నివేదికలో ఏముందంటే..
* 2017-18 కల్లా భారత్ 8 శాతం వృద్ధిని సాధిస్తుంది.
* నిన్నమొన్నటి దాకా అత్యధిక వృద్ధితో ఉన్న చైనా క్రమంగా తక్కువ స్థాయి వృద్ధిలోకి జారిపోతున్న క్రమంలో భారత్.. ఆ స్థానాన్ని భర్తీ చేస్తోంది.
* పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల్లో మెరుగుదల కనిపిస్తుండడంతో.. భారత్ సరైన వృద్ధి బాటలో పయనిస్తోంది.
* 2014-15లో జీడీపీ వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదు కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది 7.5 శాతానికి చేరగలదు.
* దేశీయంగా సంస్కరణల అమలులో ఆలస్యం, ఎగుమతుల విషయంలో బలహీనతలు, గ్రామీణ వేతన వృద్ధిలో మందగమనం లాంటివి సవాళ్లుగా నిలుస్తున్నాయి.
* ప్రభుత్వం మౌలిక పెట్టుబడులను పెంచాలన్న దృష్టితో ముందుకెళుతున్నందున ప్రభుత్వ పెట్టుబడులు వేగాన్ని పుంజుకోనున్నాయి. ప్రైవేటు పెట్టుబడులనూ ఆకర్షించే ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి.
చైనాది మందగమనమే: చైనా 2015లో 6.9%, 2016లో 6.7% వృద్ధిని నమోదు చేయవచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. చైనా కారణంగా తూర్పు ఆసియా-పసిఫిక్ ప్రాంత వృద్ధి ఈ ఏడాది 6.5%, వచ్చే ఏడాది 6.4శాతానికి పరిమితం కావచ్చని పేర్కొంది.
7.5 శాతం అధిగమిస్తాం
పన్ను వసూళ్లు లక్ష్యాన్ని చేరలేకపోవచ్చు: ఆర్థిక శాఖ
దిల్లీ: పన్ను వసూళ్లు లక్ష్యం కంటే 5-7 శాతం తక్కువగా నమోదుకావొచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు మాత్రం 7.5 శాతం అధిగమించగలదని ధీమా వ్యక్తం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి అర్థభాగం పూర్తయిన నేపథ్యంలో సోమవారమిక్కడ ఆర్థిక కార్యదర్శి రతన్ వతాల్, రెవిన్యూ కార్యదర్శి హష్ముఖ్ అధియా, ఆర్థిక కార్యకలాపాల కార్యదర్శి శక్తి కాంతదాస్, ముఖ్య ఆర్థిక కార్యదర్శి అరవింద్ సుబ్రమణియన్ తదితరులు విలేకర్ల సమావేశం నిర్వహించారు. అందులో ఎవరెవరు ఏమన్నారంటే..
సంస్కరణలు కొనసాగుతాయ్: రతన్ వతాల్
భవిష్యత్‌లో 8 శాతం వృద్ధిని సాధించడానికి సంస్కరణలను కొనసాగిస్తాం. మన స్థూల మూలాలు బలంగా ఉన్నాయి. కనిపించని విదేశీ పరిణామాలనూ తట్టుకోగల శక్తి ఉంది. జంట(ద్రవ్య, కరెంట్ ఖాతా)లోటులు తగ్గాయి. ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పన్ను వివాదాలను పరిష్కరించడం కోసం ప్రభుత్వం గట్టి యత్నాలు చేస్తోంది.
స్వచ్ఛ్ భారత్ సుంకంపై నిర్ణయం తీసుకోలేదు: హస్ముఖ్ అధియా
పన్ను వసూళ్లు బడ్జెట్ లక్ష్యం కంటే 5-7 శాతం తక్కువగా నమోదుకావొచ్చు. ప్రత్యక్ష పన్ను వసూళ్లలో స్తబ్దత ఇందుకు కారణం. బడ్జెట్లో రూ.14.5 లక్షల కోట్లను లక్ష్యంగా ఉంచుకోగా.. ఈ సారి రూ.14 లక్షల కోట్లే వసూలు కావొచ్చని అంచనా. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్ల వృద్ధి లక్ష్యం 9.9 % ఉంది. ఈ సారి దానిని 16.5 శాతంగా నిర్ణయించుకున్నాం. ఇప్పటిదాకా వసూళ్ల విషయంలో సంతృప్తిగానే ఉన్నాం. పరోక్ష పన్నులు 36.5% వృద్ధి చెందడం విశేషం. స్వచ్ఛ్ భారత్ సుంకం విషయంలో ఇంకా ఆర్థిక శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
ఎమ్‌పీసీపై త్వరలో నిర్ణయం: శక్తికాంతదాస్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.5% వృద్ధిని మించగల సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా మందగమనం ఉన్నా.. మన ఎగుమతులకు గిరాకీ తగ్గినా.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. త్వరలోనే పరపతి విధాన కమిటీ(ఎమ్‌పీసీ) నిర్మాణంపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయానికి వస్తుంది.
మరో పక్క ‘అంతర్జాతీయ వాతావరణం సవాలుభరితంగా ఉంది. ఈ ఏడాది మొదట్లో అది అంచనా కంటే క్లిష్టంగా కనిపించింది. భారత వృద్ధిపై అది కొంత ప్రభావాన్ని చూపవచ్చ’ని అరవింద్ సుబ్రమణియన్ పేర్కొన్నారు.
(
ఈనాడు వారి సౌజన్యంతో)
Comments
Post a Comment