పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుకు పలు సంస్థల అంగీకారం
చంద్రబాబు సమక్షంలో పత్రాల అందజేత
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగం పాజెక్టులకు సంబంధించి శనివారం ఒక్క రోజే రూ.1240 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. శనివారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన కార్యక్రమంలో పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టేవారికి నిబంధనల ప్రకారం ప్రోత్సాహకాలను సకాలంలో అందిస్తామని చెప్పారు. ఈ విషయంలో ఏ సమస్య ఉన్నా నేరుగా తన వద్ద ఉన్న డ్యాష్ బోర్డులో అప్‌లోడ్ చేయడం ద్వారా తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ప్రతి మూడు నెలలకోసారి సమీక్ష నిర్వహించి వెంటనే పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు. వివిధ ప్రాజెక్టులపై ఆయా సంస్థల ప్రతినిధులు, ఏపీ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ ముఖ్య కార్యదర్శి సతీష్ చందర్, పర్యాటక శాఖ కమిషనర్ రాజేంద్రప్రసాద్ ఖజూరియా, ఉప సంచాలకుడు ప్రసాద్, ఎస్కార్ట్ అధికారి వై.సత్యనారాయణ, ఈడీ అమరేంద్ర పాల్గొన్నారు. గత నెలలో రాష్ట్ర పర్యాటక విధానం ఆవిష్కరణ సందర్భంగా జరిగిన ఒప్పందాలు, ఇప్పటి ఒప్పందాలు కలిపి మొత్తం పెట్టుబడులు రూ.4500 కోట్లకు చేరాయని పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి తెలిపారు.
తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేత
ప్రైవేట్ భూముల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ప్రైవేట్ పెట్టుబడిదారులకు ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ పత్రాలను ముఖ్యమంత్రి అందజేశారు. ఇందులో..
* విశాఖలోని రిషికొండ ప్రాంతంలో రూ.50 కోట్లతో బీచ్ రిసార్టు నిర్మాణం కోసం సాయిప్రియ బీచ్ రిసార్ట్స్‌కు...
* విజయవాడ పడమట, ఇజ్రాయిలú పేటలో రూ.300 కోట్లతో మూడు, అయిదు నక్షత్రాల హోటళ్ల నిర్మాణానికి వీఎస్‌ఎన్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు...
* తిరుపతి తిరుచానూరులో రూ.85 కోట్లతో గేట్ వే అయిదు నక్షత్రాల హోటల్ నిర్మాణం కోసం బ్లిస్ హోటల్ గ్రూప్ ప్రతినిధులకు..
* కడపలో రూ.5కోట్లతో వే సైడ్ ఎమినిటీస్ ఏర్పాటు కోసం పొలి సునీతకు..
లంబసింగిలో అంతర్జాతీయ ధ్యాన కేంద్రం
విశాఖ జిల్లా పాడేరు మండలం లంబసింగి ప్రాంతంలో అంతర్జాతీయ ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని విపాసన సంస్థ ప్రతినిధి సవ్రిన కటకం ముఖ్యమంత్రిని కోరారు. ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. విపాసన సంస్థకు 60 దేశాల్లో 185 ధ్యాన కేంద్రాలున్నాయి.
ఒప్పందాలు ఇవీ..
* విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలలో రూ.800 కోట్లతో అమ్యూజ్‌మెంట్ పార్కులు, వాటర్ వరల్డ్ నిర్మాణానికి ఎల్‌ఈపీఎల్ వెంచర్స్, పాన్ ఇండియా పర్యాటన్(ఎస్‌ఎల్ వరల్డ్-ముంబై)లతో..
* విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో డెస్టినేషన్, ప్యాకేజీ టూర్స్ కోసం ఎయిర్ కోస్టాతో..
* విజయవాడ, తిరుపతిలో హోటళ్లు, రిసార్టుల కోసం ప్లియర్ హోటల్స్ ప్రైవేట్‌లిమిటెడ్‌తో..
(ఈనాడు వారి సౌజన్యంతో)
Comments
Post a Comment