- రాష్ర్టానికి పెట్టుబడుల వెల్లువ
- మూడు రోజుల్లో 331 ఒప్పందాలు
- 4.8 లక్షల కోట్ల పెట్టుబడులు
- కేంద్ర సాయంతో కలిపితే 6 లక్షల కోట్లు
- రాష్ట్రంలో పది లక్షల మందికి ఉద్యోగావకాశాలు
- సన్‌రైజ్ ఏపీకి ఉజ్వల భవిష్యత్తు
- ఇలాంటి వాతావరణాన్ని ఎన్నడూ చూడలేదు
- సీఐఐతో ఏపీ బంధాన్ని ఎవరూ విడదీయలేరు
- సదస్సులకు విశాఖే శాశ్వత వేదిక: సీఎం
విశాఖపట్నం, జనవరి 12: మూడు రోజుల సదస్సు... 41 దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రతినిధుల భాగస్వామ్యం... 331 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు... ఆంధ్రప్రదేశ్‌కు తరలి రానున్న 4.78 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు! సీఐఐతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు ఫలితమిది! రాష్ట్ర విభజనతో ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుని నిర్వహించిన ఈ సదస్సు గ్రాండ్ సక్సెస్ అయింది. దీని వల్ల రెండు లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ర్టానికి వస్తాయని తొలుత అంచనా వేసిన వారు సైతం... సదస్సు జరిగిన తీరు, తరలి రానున్న పెట్టుబడులను చూసి ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం రెట్టించిన ఉత్సాహంలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు రానున్న రోజుల్లో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వెల్లువెత్తనున్నాయని సీఎం అన్నారు. మంగళవారం భాగస్వామ్య సదస్సు ముగింపు సందర్భంగా నిర్వహించిన వేడుకలో ఆయన ప్రసంగిస్తూ... మూడు రోజులపాటు నిర్వహించిన సదస్సుకు అపూర్వ స్పందన వచ్చిందని, దేశ, విదేశాలకు చెందిన వందల మంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. సుమారు 41 దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు వచ్చారని, ఇంత భారీస్థాయిలో విదేశాల నుంచి వస్తారని అనుకోలేదన్నారు. సదస్సును విజయవంతం చేయడానికి అధికారులు, పోలీసులు, మీడియా అందరూ తమవంతు పాత్ర పోషించారని, ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి వాతావరణాన్ని ఎన్నడూ చూడలేదని అన్నారు. ఈ సదస్సుకు ఊహించని స్పందన లభించిందని, గ్రాండ్‌గా సక్సెస్ అయిందని హర్షం వ్యక్తంచేస్తూ సీఐఐకి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రంలో పెట్టుబడులు పెరగనున్నాయని, సన్‌రైజ్ ఏపీకి ఉజ్వల భవిష్యత్తు కనిపిస్తోందన్నారు. రాష్ర్టానికి ఒకపక్క సుపరిపాలన అందిస్తూనే అభివృద్ధిలో దూసుకుపోయేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంలో మంచి అనుకూల వాతావరణం ఉందని, సుదీర్ఘ తీరం, రోడ్లు, రహదారులు... ఇలా అన్ని సదుపాయాలు కలిగిన ఏకైక రాష్ట్రం ఏపీయేనని అన్నారు. ప్రతి ఒక్కరూ భాగస్వామ్య సదస్సుకు భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చారని, ఈ ఎంవోయూలన్నింటికీ త్వరతిగతిన అనుమతులు మంజూరు చేస్తామన్నారు. ఎగుమతుల మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఏపీ నిలుస్తుందని, సోలార్ సెల్స్ తయారీ, ఆటోమొబైల్ వంటి వాటికి ఇక్కడ అపారమైన అవకాశాలున్నాయన్నారు.
ఏపీ ఎప్పటికీ సన్‌రైజ్ రాష్ట్రమే..
జాతీయ, అంతర్జాతీయ సదస్సులన్నీ సీఐఐతో కలిసి ఇకపై విశాఖపట్నంలోనే నిర్వహిస్తామని, ఇదే శాశ్వత వేదిక అని ముఖ్యమంత్రి ప్రకటించారు. సీఐఐతో ఏపీ ప్రభుత్వ బంధాన్ని ఎవరూ వేరు చేయలేరన్నారు. వచ్చేసారి కేవలం పారిశ్రామికవేత్తలతోనే కాకుండా, ఎనజీవోలు, సామాజికవేత్తలు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు... ఇలా అందరినీ కలుపుకొంటూ దావోస్ సదస్సు కంటే మిన్నగా నిర్వహిస్తామని వివరించారు. దీనికి ఇప్పటి నుంచే ప్లాన చేసుకుంటామన్నారు. ఏపీ ఎప్పటికీ సనరైజ్ స్టేట్‌గానే ఉంటుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. వ్యవసాయమే ముఖ్యమని, అది బాగుంటే మిగిలిన పరిశ్రమలన్నీ నడుస్తాయన్నారు. తీరప్రాంత అభివృద్ధి, పోర్టు ఆధారిత పరిశ్రమలు, లాజిస్టిక్ హబ్‌ల ద్వారా ముందుకు వెళతామని పేర్కొన్నారు. ఈ సదస్సులో 331 ఎంఓయూలు చేసుకొని, రూ.4.78 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని, వీటి ద్వారా 10 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఇంధన, మౌలిక, సీఆర్‌డీఏ, ఔషధ, రిటైల్, పర్యాటక రంగాల్లో ఎక్కువగా అవగాహన ఒప్పందాలు జరిగాయన్నారు. ప్రముఖ సంస్థలైన ఈఎ్‌సఎస్ అండ్ ఎల్, రిలయన్స, భారత ఫోర్జ్, అశోక్ లేలాండ్, రైజింగ్ స్టార్, దివీస్, రెడ్డీస్, ట్రైనా సోలార్, డల్లాస్, స్పైస్ మొబైల్ తదితర సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయన్నారు. ట్రైనా సోలార్ 90 ఎకరాల్లో వెయ్యి మెగావాట్లకు రూ.3 వేల కోట్లతో ఒప్పందం చేసుకుందన్నారు. గృహ నిర్మాణ రంగంలో చైనా కంపెనీ ముందుకు వచ్చిందన్నారు.
త్వరలో స్పెషల్ పర్పస్ వెహికల్: గంటా
దేశ, విదేశీ ప్రతినిధులు అంతా ఇక్కడి వాతావరణానికి, ఆతిథ్యానికి ముగ్ధులయ్యారని, ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించారని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. సదస్సుకు అనూహ్య స్పందన వచ్చిందని, కేంద్రం ప్రకటించిన సాయంతో కలుపుకొంటే మొత్తం రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు సదస్సు ద్వారా వచ్చినట్లు అయిందని తెలిపారు. ఈ అవగాహన ఒప్పందాలను సమీక్షించడానికి, ఫాలోఅప్ చేయడానికి త్వరలోనే ఓ స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టనున్నట్టు ఆయన చెప్పారు.
పర్యాటకం పరవళ్లు..
పర్యాటక రంగంలో సృజనాత్మకంగా ఆలోచించి ప్రాజెక్టులు తీసుకురావాలని, దీనికి ఆకాశమే హద్దు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తిరుపతిలో టూరిజం యూనివర్సిటీని నెలకొల్పనున్నట్టు ప్రకటించారు. భాగస్వామ్య సదస్సులో మంగళవారం మధ్యాహ్నం పర్యాటక రంగంపై నిర్వహించిన ప్లీనరీ సెషనలో సీఎం మాట్లాడుతూ... సంస్కృతి మారిందని, వారాంతాల్లో కుటుంబంతో కలిసి బయటకు వెళ్లి... హోటళ్లలో భోజనం చేసి రావాలనే వారి సంఖ్య పెరుగుతోందని, ఇంట్లోకి అవసరమైన కూరల్ని కూడా కర్రీ పాయింట్ నుంచి తెచ్చుకునే అలవాటు అన్ని ప్రాంతాల్లోను అధికంగా ఉందన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని, సంతోషాలకు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని, దాన్ని అందిపుచ్చుకునే విధంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందాలని సూచించారు. హోటళ్ల సంఖ్య ఇంకా పెరగాల్సి ఉందన్నారు. సింగపూర్‌లోని హోటళ్లలో మొత్తం 54 వేల గదులు ఉన్నాయని, ఏపీ ఆ స్థాయిని దాటిపోవాలన్నారు. ఈ సదస్సులో పర్యాటక శాఖ 27 ఒప్పందాలు చేసుకుందని, వాటి ద్వారా రూ.5,242 కోట్లు పెట్టుబడులు వస్తాయని వివరించారు. వీటివల్ల 2,609 హోటల్ గదులు కొత్తగా అందుబాటులోకి వస్తాయన్నారు. విశాఖపట్నాన్ని ‘బీచెస్ అండ్ హిల్స్ సిటీ’గా ప్రకటిస్తున్నామని, వాటిని అభివృద్ధి చేసే ప్రాజెక్టులతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విజయవాడలో కాలువల ఆధారిత రిక్రియేషనను అభివృద్ధి చేస్తామన్నారు. తిరుపతిలో అందమైన సరస్సులు ఉన్నాయని, వాటి అభివృద్ధికి అక్కడ ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈ సందర్భంగా చర్చా గోష్ఠి నిర్వహించగా పలువురు తమ అభిప్రాయాలు వెల్లడించారు.
- వెలగపూడి గోపాలకృష్ణ అనే వ్యాపారవేత్త మాట్లాడుతూ... రాజకీయ అనిశ్చితి వల్ల ఏ ప్రాజెక్టుపై పెట్టుబడి పెడితే ఏమవుతుందోనన్న భయం ఉందని, ప్రభుత్వాలు మారినా ప్రాజెక్టులకు ఆటంకం కలగకుండా ఉండేలా చట్టం తేవాలని కోరారు.
- శ్రీనివాస్ అనే మరో వ్యాపారి మాట్లాడుతూ ఇదే తెలుగుదేశం ప్రభుత్వం 15 ఏళ్ల క్రితం అధికారంలో ఉన్నప్పుడు అనేక పర్యాటక ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చిందని, వాటి పరిస్థితి ఏమిటో ఇప్పుడు సమీక్షించాలని కోరారు. వాటిలో చాలా కార్యరూపం దాల్చలేదని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
- విజయవాడ భవానీ ద్వీపంలో రివర్ క్రూయిజ్ ప్రారంభించామని, దీనికి సంబంధించిన ఒప్పందంలో రెవెన్యూ షేర్ ఎంతో ఇప్పటికీ స్పష్టంచేయలేదని, దానిపై స్పష్టత ఇవ్వాలని ఆ సంస్థ ప్రతినిధి కోరారు.
- సీ ప్లేన నడుపుతున్న చంద్రశేఖర్ అనే వ్యక్తి మాట్లాడుతూ తాను కాకినాడలో స్లీపేన వారానికి 3 రోజులు అని పెడితే... వారమంతా నడిపేలా డిమాండ్ వచ్చిందని, విశాఖ జిల్లా మంగమారిపేటలో దీన్ని పెట్టడానికి ఫ్లోటింగ్ జెట్టీ అవసరమని, త్వరగా నిర్మిస్తే ఇక్కడ కూడా సీప్లేన నడుపుతామన్నారు. దీనికి సీఎం స్పందిస్తూ ఆ జెట్టీకి ఎంత ఖర్చు అయితే అంత పెట్టి నిర్మించాలని, ఆ మొత్తం వెంటనే ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనికి మూడు నెలల సమయం ఇచ్చారు.
పర్యాటకంలో ఒప్పందాలు...
కంపెనీ పెట్టుబడి రూ.కోట్లలో ఉపాధి
సముద్ర షిప్‌యార్డు లిమిటెడ్ 42 200
గ్రాండ్ యూరోహౌస్ బోట్స్ 20 200
రెయిన్‌బో క్రూయిజ్ లిమిటెడ్ 25 400
ఇంటర్ గ్లోబల్ హోటల్స్ 240 360
స్టార్‌హుడ్ హాస్పిటాలిటీ 247 360
గౌతమీ రిసార్ట్స్ 100 350
ఐవరీ శాండ్ 2,500 10,000
కాంధారీ హోటల్స్ 75 200
కేస్టల్‌హిల్ లిమిటెడ్ 165 800
ఎస్‌ఎన్‌ఎస్ రిసార్ట్స్ 164 --
ఐఏఏఐ ఏజెంట్స్ ---- -----
వండర్ లస్టు 25 100
స్కై స్కాపర్స్ హెలీ టూరిజం 100 ----
ఆలిండియా సైక్లింగ్ ఫెడరేషన్ 50 75
శ్రీశక్తి రిసార్ట్స్ లిమిటెడ్ 150 240
సేల్సన్ రిట్రీస్ 05 50
అక్షర ఎంటర్‌ప్రైజెస్ 25 20
కీస్‌హోటల్స్ 40 150
రాక్‌డేల్ హోటల్స్ 75 150
వైకేఎం ఎంటర్‌ప్రైజెస్ 257 400
శ్రీవారి ఎవెన్యూస్ 100 500
అమరావతి టూర్స్ అండ్‌ప్రోజెక్ట్స్ 110 190
విజయ్‌సిద్ధార్థ హోటల్స్ 120 300
అమరావతి ఎంటర్‌టైన్‌మెంట్ 15 50
తులసీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 05 48
మునిరెడ్డి హెల్త్‌కేర్స్ 04 20
సీఎంఆర్ మాల్స్, కన్వెన్షన్‌సెంటర్ 500 1000
Comments
Post a Comment