- దేశంలోనే తొలిసారి రిటైల్ పాలసీ ప్రకటన
- రూ.38,500 కోట్లతో విశాఖ ఉక్కు విస్తరణ
- కృష్ణపట్నంలో 3 వేల కోట్లతో రీగ్యాసిఫికేషన్ ప్లాంట్
- అమరావతిలో 800 కోట్లతో డబ్ల్యూటీసీ భారీ టవర్
- ఐటీలో 3160 కోట్ల పెట్టుబడులు
- ఫుడ్ ప్రాసెసింగ్‌లోకి 5892 కోట్లు
- అమరావతికీ పెట్టుబడుల ప్రవాహం
- 13,300 కోట్ల విలువైన ఎంవోయూలు
- హౌసింగ్‌లో హడ్కో 7500 కోట్లు
- ఆంధ్రాబ్యాంకు 5వేల కోట్లు రుణం
- విశాఖ సదస్సులో కొనసాగిన జోష్
విశాఖపట్నం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): రెండో రోజూ అదే జోష్.. నవ్యాంధ్రలో నూతన ఉత్తేజాన్ని నింపేలా పెట్టుబడుల వెల్లువ. తొలి రోజు మూడు రంగాలకే పరిమితమైన పెట్టుబడుల హామీలు రెండో రోజు అనేక రంగాలకూ విస్తరించాయి. ‘బ్రాండ్ హైదరాబాద్’ తెలంగాణకు పరిమితమైనా ‘బ్రాండ్ చంద్రబాబు’పై పెట్టుబడిదారులు విశ్వాసం ఉంచారు. సుమారు రూ.2 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు 282 ఎంవోయూలు కుదుర్చుకున్నారు. ఈ ఎంవోయూలు అమలైతే 8 లక్షల మంది నిరుద్యోగ యువత మోములపై చిరునవ్వులు విరబూయనున్నాయి. ఊహించినదాని కన్నా స్పందన అనూహ్యంగా ఉండటంతో సీఎం చంద్రబాబు ఉత్సాహంగా కనిపించారు. స్వయంగా అన్ని ఒప్పందాలను తన సమక్షంలో పూర్తి చేయించారు. ఇదే ఊపు కొనసాగితే భాగస్వామ్య సదస్సు ముగిసే సమయానికి సుమారు రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఎంవోయూలు కుదిరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో రెండో రోజైన సోమవారం పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, గృహనిర్మాణం, ఐటీ, ఇన్‌ఫ్రా, మైనింగ్, రిటైల్, విద్యుత రంగాల్లో రూ.1,90,314 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 282 ఎంవోయూలు కుదిరాయి. మొత్తం మీద రెండు రోజుల్లో సుమారు రూ.3.89 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 314 ఎంవోయూలు కుదిరాయి.
రూ.38,500 కోట్లతో విశాఖ ఉక్కు విస్తరణ
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విస్తరించేందుకు రూ.38,500 కోట్ల భారీ పెట్టుబడులకు సంస్థ యాజమాన్యం రాషీ్ట్రయ ఇస్పాత నిగం లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఎంవోయూపై ఆర్‌ఐఎన్‌ఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) పి.సి.మహాపాత్ర, రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి కార్తికేయ మిశ్రా సంతకాలు చేశారు. మొత్తం పెట్టుబడిలో రూ.25వేల కోట్లను విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వార్షిక ఉత్పత్తి సామర్ధ్యాన్ని 120 లక్షల టన్నులకు విస్తరించేందుకు ఖర్చు చేస్తారు. మరో రూ.6,100 కోట్లతో నేషనల్ మినరల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ)తో కలిసి ‘స్లర్రీ పైప్‌లైన్ అండ్ పెల్లెట్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టు కారణంగా 3వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
ఐటీలో రూ.3,160 కోట్ల పెట్టుబడులు
ఐటీ రంగంలోనూ పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చాయి. రూ.3,168 కోట్ల విలువైన 55 ఎంవోయూలు కుదిరాయి. ఇవి అమలైతే రాష్ట్ర ఐటీ రంగంలో 55,205 ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. విశాఖ నగరంలో రూ.100 కోట్లతో ఐటీ కంపెనీ పెట్టేందుకు టెక్ విజెన్ కంపెనీ ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ యూనిట్ ఏర్పాటుతో దాదాపు వెయ్యి మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయి.
శ్రీసిటీలో మరో 11 యూనిట్లు
శ్రీసిటీ సెజ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు మరో 11 కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ కంపెనీలతో శ్రీసిటీ సెజ్ యాజమాన్యం సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూలు కుదుర్చుకుంది. రూ.1,215 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ యూనిట్లతో 4వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఇందులో కోల్గేట్ పామోలివ్ కంపెనీ అత్యధికంగా రూ.450 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. తర్వాత ఇసుజు (రూ.1230 కోట్లు), విక్రం సోలార్ (రూ.220 కోట్లు) థర్మాక్స్ (రూ.200 కోట్లు) కంపెనీలు అత్యధికంగా పెట్టుబడి పెడుతున్నాయి.
తిరుపతిలో సెట్‌టాప్ బాక్స్‌ల కేంద్రం
తిరుపతిలో రూ.100 కోట్ల పెట్టుబడితో మొబైల్ చార్జర్లు, సెట్‌టాప్ బాక్స్‌ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆక్సైమ్ ఎనర్జీస్ అనే కంపెనీ ముందుకొచ్చింది. సెట్‌టాప్ బాక్స్‌ల పంపిణీ కోసం ఇప్పటికే ఎయిర్‌టెల్, టాటా వంటి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు కంపెనీ చైర్మన్ ఎం.జె.పురోహిత చెప్పారు. ఈ యూనిట్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా 2,000 మందికి, పరోక్షంగా మరో 2,000 మందికి ఉపాధి లభిస్తుంది. కాగా, తిరుపతి సమీపంలోని పారిశ్రామిక క్టస్లర్‌లో తమ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు మరికొన్ని కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ కంపెనీలు ఇక్కడ సెల్‌కాన్ కంపెనీతో కలిసి సుమారు రూ.130 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నాయి. బ్యాటరీ, చార్జర్స్, తదిర మొబైల్ యాక్సిసరీస్ తయారు చేసే కంపెనీలు సెల్‌కాన్ ద్వారా ఈ పెట్టుబడులు పెట్టబోతున్నాయి.
రెండు భారీ థర్మల్ పవర్ ప్లాంట్లు
కృష్ణా జిల్లాలో రూ.3,680 కోట్ల పెట్టుబడితో థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి మరో ఎంవోయూ కుదిరింది. ఈ పవర్ ప్రాజెక్టుతో సుమారు 3,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. భూమి కేటాయింపు కూడా పూర్తి కావడంతో కొద్దిరోజుల్లోనే పనులు ప్రారంభిస్తామని ఈ ప్రాజెక్టును చేపడుతున్న క్వీన్స్‌లాండ్ కోల్ కార్పొరేషన్ సీఈవో గౌతం శర్మ చెప్పారు. ఆస్ర్టేలియాలో కంపెనీకి ఉన్న గనుల నుంచి ఈ ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గు సరఫరా అవుతుందన్నారు. దీంతోపాటు చైనాకు చెందిన శాని గ్రూపు.. స్టేట్ పవర్ ఇన్వె్‌స్టమెంట్ కార్పొరేషన్‌తో కలిసి రూ.32వేల కోట్లతో మరో భారీ విద్యుత్తు ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. 5వేల మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంటు ద్వారా 6500 మందికి ఉపాధి లభించనుంది. ఈ థర్మల్ ప్రాజెక్టు 2020 నాటికి పూర్తవుతుంది.
అమరావతిలో మనోహర్ స్టార్ హోటల్
నవ్యాంధ్ర రాజధానిలో రూ.200 కోట్ల అంచనాతో స్టార్ హోటల్, సైౖక్లింగ్ జోన్‌లు ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్‌లోని శ్రీ శక్తి హోటల్స్ అధినేత డి.వి.మనోహర్ ముందుకొచ్చారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో రూ.150 కోట్లతో త్రీస్టార్ హోటల్, దానికి ఆనుకుని హోటల్ మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేస్తారు. ఆలిండియా సైక్లింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సైక్లింగ్‌ను ప్రమోట్ చేసేందుకు సుమారు రూ.50 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్టు మనోహర్ చెప్పారు.
హిందూపురంలో 140 కోట్లతో ఎలక్ర్టానిక్ పార్కు
అనంతపురం జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో రూ.140 కోట్లతో ఎలక్ర్టానిక్ పరిశ్రమలు పెట్టేందుకు రాఘమయూరి ఎలక్ర్టానిక్ పార్క్ ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ పార్క్ నిర్మాణం పూర్తి అయితే సుమారు 10,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ పార్క్‌లో ప్రధానంగా రక్షణ రంగానికి సంబంధించిన వస్తువులు, ఎల్‌ఈడీ లైట్స్, మెమరీ చిప్‌లు తయారుచేస్తారు. ఈ ప్రాజెక్టుని రెండేళ్లలో పూర్తి చేయాలని భావిస్తున్నట్టు కంపెనీ సీఈవో కె.భాస్కర్‌రెడ్డి చెప్పారు.
ప్రీ ఫ్యాబ్రికేషన్ బిల్డింగ్‌ల నిర్మాణం
ప్రీ ఫ్యాబ్రికేషన్ బిల్డింగ్‌ల నిర్మాణాలకు అవసరమైన యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రెకా సొల్యూషన్ అనే కంపెనీ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. రూ.100 కోట్లతో ఏర్పాటు చేసే ఈ యూనిట్‌తో సుమారు 300 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ డైరెక్టర్ యురి కెర్ట్స్ చెప్పారు.
గోదావరి, కృష్ణా జిల్లాల్లో పైప్‌ల ద్వారా గ్యాస్
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పైప్‌ల ద్వారా గ్యాస్ పంపిణీ చేసే నెట్‌వర్క్ ఏర్పాటుకు హెచ్‌పీసీఎల్ సంస్థ ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టు విలువ వెయ్యి కోట్ల రూపాయలు. అలాగే మెగా ఇంజనీరింగ్ కంపెనీ కృష్ణా జిల్లాలో రూ.500 కోట్లతో సిటీ గ్యాస్ నెట్‌వర్క్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే మూడు జిల్లాల్లో పూర్తిగా పైప్‌ల ద్వారానే గ్యాస్ సరఫరా జరుగుతుంది.
2500 కోట్లతో బీచ్ శాండ్ ప్రాజెక్టులు
శ్రీకాకులం జిల్లాలోని భావనపాడు, కళింగపట్నంలో రెండు బీచ్ శాండ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఎంవోయూలు కుదిరాయి. ట్రైమెక్స్ సంస్థ రూ.2500 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టులు చేపట్టింది. సుమారు 5500 మందికి ఉపాధి లభించనుంది.
1200 కోట్లతో దక్కన్ ఫైన్ కెమికల్స్ విస్తరణ
విశాఖ జిల్లా పాయకరావు పేట మండలం కేశవరం కేంద్రంగా పనిచేసే దక్కన్ ఫైన్ కెమికల్స్ కంపెనీని రూ.1200 కోట్లతో విస్తరించేందుకు ఎంవోయూ కుదిరింది. దీని వల్ల 1200 మందికి ఉపాధి లభించనుంది.
ఫుడ్ ప్రాసెసింగ్‌లో 5892 కోట్లు
ఫుడ్ ప్రాసెసింగ్‌కు సంబంధించిన 65 ఒప్పందాలు చేసుకున్నట్లు మైన్స్ అండ్ జియాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ తెలిపారు. 65 కంపెనీల్లో 42 ఏపీకి చెందినవేనన్నారు. ఈ ఒప్పందాల విలువ రూ.5892 కోట్లు అని, ఈ ఒప్పందాలు అమల్లోకి వస్తే 76,650 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. కాగా, కృష్ణపట్నం పోర్టు సమీపంలో రూ.920 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ఎస్‌ఎ్‌సఎస్ ఇంపెక్స్ కంపెనీ ఎంవోయూ కుదర్చుకుంది.
ప్రతిపాదిత పారిశ్రామిక క్లస్టర్లు
1. విశాఖ-శ్రీకాకుళం-భావనపాడు
2. నెల్లూరు-చిత్తూరు-చెన్నై
3. కర్నూలు-అనంతపురం-బెంగళూరు
4. మచిలీపట్నం-అమరావతి
5. కాకినాడ-విశాఖపట్టణం
రాజధానిలోనే 13300 కోట్ల పెట్టుబడులు
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో రూ.13300 కోట్లను వెచ్చించేందుకు పెట్టుబడిదారులు సిద్ధమయ్యారు. అమరావతిలో రూ.800 కోట్లతో ఓ టవర్‌ను నిర్మించేందుకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఒప్పందం కుదుర్చుకుంది. రాజధాని నగరంలో గృహనిర్మాణం కోసం హడ్కో రూ.7500 కోట్లు, ఆంధ్రాబ్యాంకు రూ.5వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. అమరావతి నిర్మాణ వ్యయానికి ఆంధ్రా బ్యాంకు 5 వేల కోట్ల మొత్తాన్ని రుణంగా సమకూర్చనుంది.
5 పారిశ్రామిక క్లస్టర్లు
భాగస్వామ్య సదస్సుకు 41 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. దేశ,విదేశాలకు చెందిన 1500 మందికిపైగా పాల్గొన్నారు. సదస్సుకు హాజరైన వారంతా ఏపీ భవిష్యత్తు పట్ల ఎంతో విశ్వాసం ప్రకటించారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం సదస్సులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. చిన్న తరహా పరిశ్రమలే ఉపాధికి ఊతంగా నిలుస్తాయని భావించి తాము రూ.100 కోట్లతో ఎంఎ్‌సఎంఇ రివైవల్ ఫండ్ ఏర్పాటు చేసినట్టు సీఎం తెలిపారు. రాష్ర్టాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ఐదు పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. తిరుపతిని హార్డ్‌వేర్ హబ్‌గా తీర్చి దిద్దుతామన్నారు. సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ కార్యరూపం దాలిస్తే లక్షలాది ఉద్యోగవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇప్పటికే పారిశ్రామికంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఒక్క శ్రీసిటీలోనే 3 లక్షల ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయని చంద్రబాబు చెప్పారు.
Comments
Post a Comment