చంద్రబాబుతో సమావేశమైన నెదర్లాండ్స్ రాయబారి అల్ఫాన్సస్ స్టోలింగ
ఆగ్రో ప్రాసెసింగ్, ఆక్వా రంగాలపై ఆసక్తి
సిఎం చంద్రబాబుపై ప్రశంసలు
విజయవాడ, అక్టోబర్ 29: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పలు డచ్ కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. నెదర్లాండ్స్ రాయబారి అల్ఫాన్సస్ స్టోలింగ ఆధ్వర్యంలో డచ్ వాణిజ్య, పారిశ్రామికవేత్తల బృందం గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. కొత్త రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు, వాణిజ్య కార్యకలాపాలు సాగించేందుకు ఆసక్తి కనబరిచారు. దీనిపై ఒక రోడ్ మ్యాప్ రూపొందించేందుకు జాయింట్ వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. 16 నెలల పసికూనగా ఉన్న కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యంగా 10 రంగాలపై దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి ఈ బృందానికి చెప్పారు.
ఆగ్రో ఫుడ్ ప్రాసెసింగ్, లైఫ్ సైనె్సస్, టెక్స్‌టైల్స్ అప్పారల్స్, ఎలక్ట్రానిక్స్, మినరల్ ఇండస్ట్రీ, ఎయిరోస్పేస్, ఎనర్జీ, లెదర్, పెట్రో కెమికల్స్, ఆటోమొబైల్ రంగాలలో ఇక్కడ విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. సహజ వనరులు, మానవ వనరులతోపాటు విద్యుత్, భూమి, కనెక్టివిటీలో ఏపి అగ్రగామిగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. నెదర్లాండ్స్‌తో ఏపికి చాలా విషయాల్లో పోలికలు ఉన్నాయన్నారు. వ్యవసాయంలో సాంకేతికతను అందిపుచ్చుకున్న దేశంగా నెదర్లాండ్‌ను పదే పదే ఇక్కడ ప్రభుత్వ అధికారులకు గుర్తు చేస్తారన్నారు. ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులలో డచ్ రెండో స్థానాన్ని ఆక్రమించిందని, అక్కడిలాగే ఇక్కడ కూడా వ్యవసాయ యాంత్రీకరణపై దృష్టిపెడితే ఆంధ్రప్రదేశ్‌కు తిరుగులేదన్నారు. నెదర్లాండ్స్‌లో మాదిరే ఏపిలో కూడా జల రవాణాను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్‌లో పెట్టుబడులు పెట్టేవారికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయన్నారు.
ఇటీవలే అగ్రికల్చరల్ ఇ-మార్కెటింగ్ ప్రవేశపెట్టామని, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్ బాస్కెట్, స్నాప్ డీల్ వంటి ఇ-ట్రేడింగ్ దిగ్గజాలతో డ్వాక్రా మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు పరిచయం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కాగా, తమకు అవకాశం కల్పిస్తే ఏపిలోని డ్వాక్రా మహిళల ఆదాయ మార్గాలు పెంచడంలో సహాయపడతామని ఉమెన్ ఆన్ వింగ్స్ బిజినెస్ కన్సల్టెంట్ సుప్రియా కపూర్ ముందుకొచ్చారు. అలాగే ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనతో ఎనర్జీ సేవింగ్స్ డివైసెస్ ద్వారా రాష్ట్రంలో నిర్మించబోయే భారీ భవంతులు, వ్యాపార సముదాయాలు, గృహాల్లో విద్యుత్ ఆదా చేయడానికి ఫిలిప్స్ ప్రతినిధులు ముందుకొచ్చారు.
స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా విద్యుత్ పంపిణీ సంస్థలతో కలిసి పని చేయాలని సిఎం వారికి సూచించారు. జియోక్రెట్ పేరిట తాము రూపొందించిన ఆధునాతన సాంకేతిక యంత్ర పరికరాలతో పటిష్ఠమైన రహదారి నిర్మాణాలను చేపడతామని కాబా ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ ముందుకొచ్చింది. వీరికి పైలట్ ప్రాజెక్టు కింద 25 కిలో మీటర్ల రహదారిని నిర్మించడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ప్రకటించారు. ఏపిలో మిరప విత్తనాలను సాగుచేసి వాటిని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేందుకు సహకరిస్తామని బీజ్ షీతల్ రీసెర్చ్ కంపెనీ ముఖ్యమంత్రి ముందు ప్రతిపాదించింది.
అలాగే సాలిడరిడాడ్ అనే మరో కంపెనీ ఆక్వా రంగంలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. దీంతో ఆక్వా రంగంలో ఇప్పటికే 42 శాతం వృద్ధి సాధించామని, మున్ముందు ఏపిని ఈ రంగంలో ప్రపంచానికే హబ్‌గా తయారు చేస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఆక్వా యూనివర్శిటీ ఏర్పాటుకు సహకరించాలని ఆయన ఈ సందర్భంగా పలు ఆక్వా కంపెనీలను కోరారు. మరోవైపు కొత్తతరం అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి తనదైన విజన్‌తో ముందుకు దూసుకుపోతున్నారని నెదర్లాండ్స్ రాయబారి అల్ఫాన్సస్ స్టోలింగ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల స్వర్గ్ధామంగా మలిచేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న తమ కంపెనీలతో జనవరి నాటికి ఒక కార్యాచరణ సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో తొలుత ఏపి ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు చైర్మన్ వీవీ రమేష్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, పరిశ్రమల శాఖ కార్యదర్శి రావత్, పోర్టుల డైరెక్టర్ రవికుమార్, మైనింగ్ డైరెక్టర్ గిరిజా శంకర్, సిఎంవో కార్యదర్శులు పాల్గొన్నారు.
చివర్లో ముఖ్యమంత్రితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు డచ్ బృందం పోటీపడటం విశేషం.
Comments
Post a Comment