భారత్‌లో సౌర విద్యుత్‌కు 100 కోట్ల
యూరోలకు పైగా జర్మనీ సాయం
ఇరు దేశాల మధ్య 18 ఒప్పందాలు
మోదీ, మెర్కెల్ సుదీర్ఘ చర్చలు
భారత్‌ను ఆర్థికంగా పరివర్తన చేయాలన్న మా సంకల్పానికి జర్మనీ సహజ భాగస్వామి అవుతుందనుకుంటున్నా. జర్మనీ సామర్థ్యాలు, భారత ప్రాధాన్యతలకు జోడీ కుదిరింది. ఆర్థిక సంబంధాల బలోపేతం పైనే మాదృష్టంతా. అంతులేని సవాళ్లు, విస్తృత అవకాశాలకు కొదవలేని ఈ రోజుల్లో... మరింత మానవీయ, శాంతియుత, సుస్థిర ప్రపంచ నిర్మాణంలో భారత్-జర్మనీలు సుదృఢ భాగస్వాములుగా ముందడుగు వేస్తాయని విశ్వసిస్తున్నా -నరేంద్ర మోదీ
వివిధ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లడంలో మోదీ వేగం అద్భుతం. ఇరుదేశాల మధ్య చర్చలు ఫలవంతంగా సాగాయి. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, సౌరవిద్యుత్ రంగాలకు సంబంధించి ఇరు దేశాలూ అనేక నిర్ణయాలు తీసుకున్నాయి - ఏంజెలా మెర్కెల్
భారత్-జర్మనీ సంబంధాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. రక్షణ ఉత్పత్తులు, వాణిజ్యం, భద్రత, నిఘా, రైల్వేలు, పరిశుద్ధ ఇంధనం...లాంటి కీలక రంగాల్లో తమ మధ్య సంబంధాల్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయానికి వచ్చాయి. ఇందులో భాగంగా 18 అవగాహన ఒప్పందాల(ఎంఓయూ)పై సంతకాలు చేశాయి. భారత్‌లో జర్మన్ కంపెనీలకు శీఘ్రగతిన అనుమతులు ఇవ్వడం, భారత్‌లో సౌర విద్యుత్ ప్రాజెక్టులకు వందకోట్ల యూరోలకు పైగా సహాయాన్ని జర్మనీ ప్రకటించడం ఈ ఒప్పందాల్లో అత్యంత కీలకమైనవి. ప్రధాని నరేంద్ర మోదీ, జర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ మధ్య సోమవారం నాడిక్కడ జరిగిన విస్తృత చర్చల అనంతరం ఈ ఒప్పందాలు కుదిరాయి. భారత్-జర్మనీ అంతర్ ప్రభుత్వాల సంప్రదింపుల కమిటీ మూడో శిఖరాగ్ర సదస్సుకు మోదీ, మెర్కెల్ నాయకత్వం వహించారు. ముఖాముఖి, ప్రతినిధుల స్థాయిలో దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిగాయి.
చర్చలు ఫలవంతం
చర్చలు చాలా ఫలవంతంగా సాగాయని ఇరువురు నేతలూ ప్రకటించారు. వ్యూహాత్మక అంశాల్లో రెండు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలపడటానికి ఈ చర్చలు ఉపకరిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. అంతర్‌ప్రభుత్వాల సంప్రదింపుల యంత్రాంగం విలక్షణమైనదని, ద్వైపాక్షిక సంబంధాల సర్వతోముఖాభివృద్ధిలో ఇది ఎంతో మార్పు తెచ్చిందని ప్రధాని వివరించారు. ఉత్పాదక రంగం, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు, వాణిజ్య రంగాల్లో విస్తృతిని కాంక్షిస్తున్నట్లు చెప్పారు. జర్మనీ ఇంజినీరింగ్, భారత ఐటీ నైపుణ్యం- మరింత సమర్థ, ఆర్థిక సుస్థిర, పర్యావరణ అనుకూల పరిశ్రమను సృష్టించగలదన్నారు. స్మార్ట్ సిటీలు, గంగా ప్రక్షాళన, వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టుల్లో జర్మనీ సహాయ సహకారాలు ఒక నిర్దిష్ట రూపాన్ని సంతరించుకున్నాయని తెలిపారు. భారత హరిత ఇంధన కారిడార్‌లో వంద కోట్ల యూరోల జర్మనీ సహాయం పట్ల, అలాగే భారత సౌర విద్యుత్ ప్రాజెక్టులకు మరో వందకోట్ల యూరోల సహాయం పట్ల తామెంతో కృతజ్ఞులమై ఉంటామన్నారు. నానాటికీ పెరుగుతున్న తీవ్రవాద ముప్పు పట్ల ఆందోళన ఇరువురు నేతలు వ్యక్తంచేశారు. దీన్ని తిప్పికొట్టేందుకు ఉభయ దేశాల సంయుక్త వర్కింగ్ గ్రూపులు తరచూ సమావేశం కావాలని నిర్ణయించారు. చర్చల తర్వాత ఒక సంయుక్త ప్రకటనను కూడా వెలువరించారు.
అవగాహనలివీ...
* జర్మన్‌ను విదేశీ భాషగా భారత్‌లో ప్రోత్సహించడం, అలాగే ఆధునిక భారతీయ భాషల్ని జర్మనీలో ప్రోత్సహించడం కోసం భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ, జర్మనీ సమాఖ్య విదేశీ కార్యాలయం మధ్య కుదిరిన సంయుక్త ప్రకటనపై ఇరుదేశాలూ సంతకాలు చేశాయి.
* మోదీ ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమానికి జర్మనీ కంపెనీలు తోడ్పాడునందించేందుకు వీలుగా ఆ కంపెనీలకు క్లియరెన్స్‌ల కోసం ఫాస్ట్‌ట్రాక్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. వచ్చే ఏడాది మార్చినాటికి ఇది పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తుంది.
* భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం కలసికట్టుగా కృషిచేయాలని తీర్మానించారు.
* ఆహార భద్రత, పునరుత్పాదక ఇంధనం, శాస్త్ర సాంకేతిక రంగాలు, నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్య, ఉత్పాదకరంగం, పౌర విమానయానం, విపత్తుల నిర్వహణ, వ్యవసాయం లాంటి రంగాల్లో ఇరుదేశాలు పరస్పరం సహకరించుకుంటాయి.
దుర్గామాత విగ్రహాన్ని తిరిగిచ్చిన మెర్కెల్
కశ్మీర్‌లోని పుల్వామాలో ఉన్న ఓ ఆలయంలో రెండు దశాబ్దాల కిందట అపహరణకు గురై.. జర్మనీలో దొరికిన పదో శతాబ్దానికి చెందిన దుర్గామాత విగ్రహా(మహిషాసురమర్దిని అవతారం)న్ని మోదీకి మెర్కెల్ తిరిగి ఇచ్చారు. ఈ విగ్రహాన్ని భారత్‌కు తిరిగి ఇచ్చినందుకు జర్మనీకి, ప్రత్యేకించి మెర్కెల్‌కు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. స్టట్‌గార్ట్(జర్మనీ)లోని లిండెన్ మ్యూజియంలో ఈ విగ్రహం ఉన్నట్లు మూడేళ్ల కిందట భారత పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ)కు సమాచారం అందింది. దీనికోసం ఏఎస్‌ఐ అధికారులు జర్మనీకి కూడా వెళ్లివచ్చారు. భారత ఆర్ట్ డీలర్ సుభాష్ కపూర్ ఈ విగ్రహాన్ని స్మగ్లింగ్ చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇతన్ని 2011లో జర్మనీలో అరెస్టుచేశారు.
(
ఈనాడు వారి సౌజన్యంతో)
Comments
Post a Comment