వేలయు లేని యంబునిధి వేగమునన్ జనునాంధర సైన్య జం
ఘాలత మందగించె క్షణకాలము మాత్రమ యాంధ్రవిశ్వవి
ద్యాలయ మిచ్చు స్వాగతము నందుటకై యమరావతీపురిన్
బాలకవుల్ పఠించు జయపద్యములన్ విని మెచ్చుకొంటకున్
ధాన్యకటక దుర్గము నుంచి దండయాత్రికుడై గౌతమీపుత్ర శాతకర్ణి బయలువెడలినప్పుడు, కూతవేటు
దూరంలోనే ఉన్న అమరావతీ పట్టణంలో ఆంధ్రవిశ్వవిద్యాలయ బాలకవులు స్వాగతపూర్వకంగా చెప్పే
జయపద్యాలను వినడానికి సేనల వేగం కొద్దిగా మందగించిందట. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ
ఆంధ్రప్రశస్తిలోని ఆణిముత్యం ఈ పద్యం. నాసిక్ దగ్గర ఏదో గుహలో దొరికిన శాసనం వల్ల
శాతవాహనులకు ఒక దశలో రాజధానిగా ధాన్యకటకం (ధరణికోట) ఉన్నదని తెలిసింది. దానితో జాతీయోద్యమ
కాలంలోనూ, ఆంధ్రోద్యమ కాలంలోనూ తెలుగువారి ఘనకీర్తి గొప్ప స్ఫూర్తిదాయకమైంది. దాదాపు
రెండువేల సంవత్సరాల తరువాత తిరిగి తెలుగువారి ఒక రాజధానిగా అదే ప్రాంతం నేడు ఆవిష్కృతం
కానున్నది. నూతన రాజధాని అమరావతి పరిధిలో పాత అమరావతి గ్రామం లేకపోయి ఉండవచ్చు. శాతవాహనుల
రాజధాని అమరావతి కాక, దానికి సుమారు కిలోమీటరు దూరంలోని ధరణి కోట అయి ఉండవచ్చు. కానీ,
ఆ ప్రాంతం అంతా కలగలసిపోయి ఒక చారిత్రక ఆధునిక నగరం అవతరించబోతున్న మాట వాస్తవం. చరిత్ర
తాకిడులను తట్టుకుని శిథిలంగానైనా ప్రపంచ పర్యాటకపటంలో నిలబడినది అమరావతి కాబట్టి,
రాచరికం కంటె బౌద్ధమూ విద్యాలయమూ గర్వకారణమయినవి కాబట్టి- అమరావతి నామకరణమే యోగ్యం,
శ్రేష్ఠం. ఇందులో మరొక అభిప్రాయానికి తావు లేదు.
రాష్ట్ర విభజన కారణంగా, నూతన రాజధాని నిర్మించుకోవలసిన అగత్యంలో ఉన్న ఆంధ్రప్రదేశ్
రాష్ట్రం, ఆ ప్రయాణంలో తొలిఅడుగుగా కీలకమైన ఘట్టంగా ఈ విజయదశమి నాడు అమరావతిలో శంకుస్థాపన
జరుపుకుంటున్నది.
విభజన జరిగిన పదహారు నెలల కాలంలోనే
రాజధాని స్థలం ఎంపిక, భూసమీకరణ జరిపి ఆంధ్రప్రదేశ్ ప్రజలలో విశ్వాసం పాదుకొల్పినందుకు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందనీయులు. అంతేకాదు, ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీని
ముఖ్యఅ తిథిగా ఒప్పించడం ద్వారా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాషా్ట్రనికి కావలసిన ప్రత్యేక
సదుపాయాలను ప్రకటింపజేయడానికి వేదిక కల్పించడం అభినందనీయం. అన్నిటికి మించి తెలంగాణ
ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును స్వయంగా ఆహ్వానించి రెండు రాషా్ట్రల మధ్య సద్భావన కలిగించడానికి
పునాదులు వేయడం ప్రశంసనీయమైన విజయం. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనాయకుడు వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి
ఈ కార్యక్రమానికి రాగూడదని నిర్ణయించుకోవడం విచారకరం. ఆయన కానీ, కాంగ్రెస్ పార్టీ
కానీ- ఈ శుభసందర్భంలో తమ అభ్యంతరాలను పక్కనపెట్టి ఉంటే హుందాగా ఉండేది.
ఈ సందర్భం చరిత్రాత్మకమైనదే అయినా
దీని వెనుక కొన్ని అసంతృప్తులు లేకపోలేదు. రాజధాని ఎంపిక దగ్గర నుంచి భూసమీకరణ దాకా
మరింత మెరుగైన పద్ధతిలో జరిగి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం చాలామందిలో ఉన్నది. రాజధాని
శంకుస్థాపనకు నలుమూలల నుంచి మట్టి, నీరు సేకరించడం ద్వారా అందరినీ భాగస్వాములను చేయాలని
భావించినట్టే, మొత్తం నిర్ణయప్రకియ్రలో కూడా అందరికీ భాగస్వామ్యం కల్పించి ఉండవలసింది.
భూములు మాత్రమే కాక, ఉపాధిని వృత్తులను కోల్పోతున్న సమస్త ప్రజలనూ ప్రభుత్వం తగినంతగా
ఆదరించవలసి ఉన్నది. నూతన రాజధాని రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమే అయినా, అదొక్కటే పదమూడు
జిల్లాల ఆకాంక్షలను నెరవేర్చలేదు. తొమ్మిది వెనుకబడిన జిల్లాలున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి
వికేంద్రీకరణపై దృష్టిపెట్టకపోతే, మున్ముందు అసంతృప్తులు ప్రాంతీయ విభేదాలుగా పరిణమించే
ఆస్కారం ఉన్నది. నూతన రాజధానిని మాత్రమే కాక మరో మూడు నాలుగు ప్రస్తుత పట్టణాల అభివృద్ధి
మీద ఆంధ్రప్రదేశ్ దృష్టిపెట్టవలసి ఉన్నది. రెండు తెలుగు రాషా్ట్రల ప్రజల మధ్య సఖ్యతను
పెంపొందించడం, అన్ని ప్రాంతాల ప్రజల మధ్య భాగస్వామ్య భావనను కల్పించడం- అభివృద్ధి ప్రస్థానంలో
ముఖ్యాంశాలు.
అమరావతీ ప్రాంత చారిత్రక స్ఫూర్తిని, పురాతత్వ సంపదను కాపాడుకుంటూ, అనారోగ్యకరమైన
మహాపట్టణీకరణ ధోరణులను ఆశ్రయించకుండా పర్యావరణానికీ, ప్రజలకు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు
హితవు అయిన మార్గాన్ని అనుసరించినప్పుడే అమరావతి పునరవతరణ అర్థవంతం అవుతుంది. అమరావతి
దేవతల నగరం అని మాత్రమే కాదు అర్థం, నాశనం లేని జనావాసం అన్నది దాని మూల అర్థం. జననగరమై
అమరావతి వర్థిల్లు గాక!
(ఆంధ్రజ్యోతి వారి సౌజన్యంతో)
Comments
Post a Comment