ఏపీలో 2,500 మెగావాట్ల సౌర విద్యుత్ పార్కు
ఆంధ్రప్రదేశ్ చొరవ, స్పందన బాగుంది
మార్చిలోగా 619 మెగావాట్ల ప్రాజెక్టులను నిర్మించాలి
ఎంఎన్‌ఆర్‌ఈ సంయుక్త కార్యదర్శి తరుణ్ కపూర్
ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పబోయే సౌర విద్యుత్ పార్కు ప్రపంచంలోనే అతి పెద్దది అయ్యే అవకాశముందని కేంద్ర సంప్రదాయేతర ఇంధనవనరులశాఖ (ఎంఎన్‌ఆర్‌ఈ) సంయుక్త కార్యదర్శి తరుణ్‌కపూర్ చెప్పారు. 2,500 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం కలిగిన ‘పార్కు’ను ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేస్తోందని తెలిపారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినయోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చొరవ, స్పందన బాగుందని ఆయన ప్రశంసించారు. పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో పెట్టుబడులను అంతర్జాతీయస్థాయిలో ఆకర్షించేలక్ష్యంతో జరుపుతున్న ప్రాంతీయ సమావేశాల్లో భాగంగా ఏపీకి సంబంధించిన సమావేశం బుధవారం ఉదయం ఇక్కడ జరిగింది. ఎంఎన్‌ఆర్‌ఈ, భారతీయ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (ఇరిడా), ఆంధ్రప్రదేశ్ నూతన మరియు పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌కాప్) సంయుక్తంగా ఈ సమావేశాన్ని నిర్వహించాయి.
పెట్టుబడులకు మంచి అవకాశం
ఆంధ్రప్రదేశ్‌లో పవన, సౌర విద్యుత్‌లో పెట్టుబడులకు మంచి అవకాశముందని, పెట్టుబడిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ఇంధనశాఖ కార్యదర్శి అజయ్‌జైన్ కోరారు. సౌర ఫలకాల తయారీ యూనిట్లు కూడా ఏపీలో రావాలన్న విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలగా ఉన్నారని ఆయన తెలియజేశారు. ‘నెడ్‌కాప్’ మేనేజింగ్ డైరెక్టర్ కమలాకరబాబు మాట్లాడుతూ తరుణ్ కపూర్ ఏపీ అడిగిన వెంటనే స్పందిస్తున్నారని, 10 వేల సౌర లాంతర్లు ఇచ్చారని తెలిపారు. ‘ఇరిడా’ డైరెక్టర్ (సాంకేతిక) డాక్టర్ బి.వి.రావు, ఏపీజెన్‌కో మేనేజింగ్ డైరెక్టర్, ఏపీట్రాన్స్‌కో ఇన్‌ఛార్జ్ సీఎండీ కె.విజయానంద్, ఇంధనశాఖ సలహాదారు కె.రంగనాథమ్, తదితరులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
వసూలు సొమ్ము వెనక్కు!
ఆంధ్రప్రదేశ్ సౌర విద్యుత్ విధానం ప్రకారం ఏపీట్రాన్స్‌కో, విద్యుత్ పంపిణీ సంస్థల విద్యుత్ లైన్లను ఉపయోగించుకుని ఓపెన్ యాక్సిస్ ద్వారా సౌర విద్యుత్ అమ్ముకున్నా ‘క్రాస్ సబ్సిడీ’ వసూలు చేయరాదు. ఇదే విషయాన్ని స్పష్టీకరిస్తూ గత ఫిబ్రవరిలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నా తమ నుంచి ఈ రాయితీని వసూలు చేస్తున్నారని సమావేశంలో పెట్టుబడిదారుడొకరు అజయ్‌జైన్, విజయానంద్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపైన వారు స్పందిస్తూ ఉత్తర్వు జారీ అయిన నాటి నుంచి వసూలు చేసిన మొత్తాన్ని వెనక్కు ఇవ్వాలని విద్యుత్ సంస్థలకు స్పష్టం చేశారు.
Comments
Post a Comment